కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 3 : దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సింగరేణి థర్మల్, సోలార్ ప్రాజెక్టులపై డైరెక్టర్ ఈఅండ్ఎం డి.సత్యనారాయణరావు, ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఇప్పటికే 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో వెయ్యి మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు చేసే యోచనలో ఉందన్నారు.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గడిచిన 5 నెలల కాలంలో వరుసగా 90 శాతం పైగా పీఎల్ఎప్ సాధిస్తూ దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ప్లాంట్లలో నంబర్‌వన్ స్థానంలో ఉండటం అభినందనీయమని, ఇదే విధంగా మరిన్ని ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ అగ్రస్థానాన్ని కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన పది నెలల కాలంలో 6,208 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందని, ఇది గతేడాది ఇదే కాలానికి చేసిన విద్యుత్ ఉత్పత్తి కన్నా 25 శాతం వృద్ధిలో 7,737 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా లాభాలను ఆర్జించాలని సూచించారు. ఈ సమీక్షలో జీఎం సింగరేణి సోలార్ సూర్యనారాయణరాజు, చీప్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్‌కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జేఎన్ సింగ్, జీఎం (సివిల్) రమేశ్‌బాబు, ఎస్ఈ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.