పెనుబల్లి (కల్లూరు), ఆగస్టు 4 : ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ వసతి గృహంలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న గంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినుల కథనం ప్రకారం.. కల్లూరులోని గిరిజన బాలికల పాఠశాల వసతి గృహంలో ఆరు నుంచి పది తరగతుల వరకూ చదువుతున్న విద్యార్థినులు మొత్తం 96 మంది ఉన్నారు. వారిలో సోమవారం 86 మంది విద్యార్థినులు హాజరయ్యారు.
వీరికి హాస్టల్ బాధ్యులు ఉదయం అల్పాహారంగా కిచిడీ వండారు. రోజూలాగే సోమవారం ఉదయం కూడా ఆ కిచిడీని అల్పాహారంగా తిన్న విద్యార్థినులు ఆ తరువాత పాఠశాలకు వెళ్లిపోయారు. అలా వెళ్లిన గంట వ్యవధిలోనే వారిలో సుమారు 30 మంది విద్యార్థినులు పాఠశాలలో అస్వస్థతకు గురయ్యారు. ఒక్కరొక్కరుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు వారిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు.
విద్యార్థినుల అస్వస్థత గురించి తెలుసుకున్న కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి వెంటనే సదరు వైద్యశాలకు చేరుకొని విద్యార్థినుల అస్వస్థత గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వైద్యురాలైన ఎమ్మెల్యే రాగమయి విద్యార్థినులను ఆరోగ్య పరిస్థితి పరీక్షించారు. ప్రమాదమేమీ లేదని చెప్పారు. అనంతరం, కల్లూరు ప్రభుత్వ వైద్యుడు నవ్యకాంత్ సదరు విద్యార్థినులకు మెరుగైన వైద్యమందించారు. తహసీల్దార్ సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్‌లు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆసుపత్రిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి.. వెంటనే సదరు వసతి గృహానికి వెళ్లి అక్కడి పరిసరాలు, వంట గదిని, వంట చేసే విధానాన్ని పరిశీలించారు. వంట గది, పరిసరాల అపరిశుభ్రత పట్ల వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచిడీ నాణ్యంగా లేకపోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, ఇందుకు వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటూ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, వసతి అందడం లేదని బీఆర్ఎస్ కల్లూరు మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరు సీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినుల అస్వస్థతకు కారకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కట్టా అజయ్‌కుమార్, లక్కినేని రఘు, కొరకొప్పుల ప్రసాద్, మేకల కృష్ణ, కాంటనేని వెంకటేశ్వరరావు తదితరులు డిమాండ్ చేశారు.
తమ హాస్టల్లో రోజూ నీళ్ల చారు, ఉడకని అన్నంతోనే తమకు భోజనం పెడుతున్నారని అస్వస్థతకు గురైన విద్యార్థినులు వాపోయారు. చారు నీళ్లలా ఉందని, అన్నం ఉడకలేదని హాస్టల్ బాధ్యులను అడిగితే వారు తమపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉడకని అన్నం తిన్నప్పుడల్లా తమకు కడుపు నొప్పి వస్తోందని, అల్పాహారాన్ని కూడా సరిగా ఉడికించకుండానే వడ్డిస్తున్నారని అన్నారు.
ఖమ్మం, ఆగస్టు 4 : కల్లూరు గిరిజన ఆశ్రమ బాలిక పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన అంశంపై ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్యం గురించి వైద్యులను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలకు తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.