అశ్వారావుపేట టౌన్/ దుమ్ముగూడెం/ చర్ల/ టేకులపల్లి/ ఇల్లెందు రూరల్/ మణుగూరు టౌన్, మార్చి 17: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని అంగన్వాడీలు ఆరోపించారు. ఇందుకోసం తీసుకొస్తున్న జాతీయ విద్యావిధానాన్ని, పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సోమవారం అంగన్వాడీలు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అశ్వారావుపేట, చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, మణుగూరు మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సంఘం నేతలు మాట్లాడుతూ.. ప్రమోషన్ పొందిన మినీ అంగన్వాడీ టీచర్లకు పూర్తి వేతనం చెల్లించాలని, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం గ్రాట్యుటీ చట్టాన్ని అమలుచేయాలని, రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, ఐసీడీఎస్‌కు బడ్జెట్లో నిధులు పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయా మండలాల్లో సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.