భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో చాలాకాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేఫన్ విడుదల చేయడంతో అధికార పార్టీ నాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జిల్లాలో ఖాళీగా ఉన్న 178 అంగన్వాడీ పోస్టులను, 878 ఆయాల పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ టీచర్ పోస్టుల దరఖాస్తు గడువు ఇప్పటికే పూర్తయింది. 4,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అర్హత నిబంధనలను నోటిఫికేషన్లో పొందుపరిచినప్పటికీ సరైన అర్హతలు లేనివారు కూడా ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే, అధికార పార్టీ నేతల నుంచి పైరవీల జోరు కొనసాగుతుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఏజెన్సీ ప్రాంతం కావడంతో టీచర్లు, ఆయాల పోస్టులకు రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీని ప్రకారం నిర్ణీత పోస్టుకు సంబంధిత అర్హతలు ఉన్న స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కానీ, స్థానికేతరులతోపాటు నిర్ణీత అర్హతలు లేని అభ్యర్థుల నుంచి కూడా అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇంటర్ అర్హతను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ.. డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అప్లయి చేసుకున్న వారిలో సాంకేతిక విద్యార్హత ఉన్న వారు కూడా ఉండడంతో వారిని అనర్హులుగా ప్రకటించారు.
జిల్లాలో ఖాళీగా ఉన్న 178 అంగన్వాడీ పోస్టులకు 4,648 దరఖాస్తులు వచ్చాయి. టీచర్ పోస్టులకు దరఖాస్తు గడువు ముగియడంతో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. అయితే.. డిగ్రీ, పీజీ విద్యార్హతలు ఉన్న దరఖాస్తులను పునఃపరిశీలిస్తున్నారు. కాగా, 878 ఆయాల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 4,060 దరఖాస్తులు వచ్చాయి. వాటిని కూడా సీడీపీవోలు పరిశీలిస్తున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయితే డివిజన్ల పరిధిలో కమిటీల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు చేపట్టనున్నారు.
అంగన్వాడీ పోస్టులకు అధికార పార్టీ నేతల నుంచి భారీస్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. వారం రోజులుగా ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు. పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు అభ్యర్థులకు, ఆశావహులకు మాట ఇచ్చిన అధికార పార్టీ నేతలు.. ఆ సిఫార్సు లేఖను వారికి అప్పగిస్తున్నారు. దీంతో ఆయా అభ్యర్థులు, ఆశావహులు సదరు సిఫార్సు లేఖను తీసుకెళ్లి జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేస్తున్నారు. దీంతోపాటు ‘ఫలానా అంగన్వాడీ కేంద్రం భవనానికి మా తాత స్థలం దానం చేశారు.
అందువల్ల అక్కడి అంగన్వాడీ పోస్టు మాకే ఇవ్వాలి’ అంటూ కొందరు కోరుతున్నారు. మరికొందరైతే ఏకంగా దాతలు ఇచ్చిన పత్రాలను కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సిఫార్సు లేఖలతో జిల్లా కార్యాలయానికి వచ్చి జిల్లా అధికారులను కలుస్తున్నారు. ‘ఫలానా పోస్టు మేం చెప్పిన వాళ్లకు కచ్చితంగా రావాల్సిందే’ అంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరికొంతమంది సర్పంచ్లు కూడా ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ఫోన్లు చేసి ‘మా క్యాండిడేట్ ఐప్లె చేశారు. చూడండి. తప్పనిసరిగా పోస్టు రావాలి’ అంటూ స్పష్టం చేస్తున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధులు మంత్రుల తరఫున కూడా అధికారులకు ఫోన్లు చేయిస్తుండడం గమనార్హం. దీంతో అధికారుల కమిటీ బాధ్యులు తలలు పట్టుకుంటున్నారు.
కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్లో అత్యధికంగా వచ్చిన మార్కుల ఆధారంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కమిటీ ఆమోదంతో పోస్టులు కేటాయిస్తారు. స్థానికత ముఖ్యం. నిబంధనలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఎలాంటి పైరవీలూ నడవవు. ఎవరు చెప్పినా వినడం తప్ప సొంత నిర్ణయం ఉండదు. ఫైనల్ లిస్టును అధికారికంగా నోటీసు బోర్డులో పెడతాం.
-స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూవో, భద్రాద్రి