హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సైబర్ ఫ్రాడ్ కేసుల్లో దాదాపు 60శాతం పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ మోసాలేనని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు. మాదాపూర్లోని ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన ‘కన్వర్జేషన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ- వెన్ ట్రస్ట్ బికమ్స్ ది వెపన్-ది న్యూ బ్యాటిల్ ఫర్ ది హ్యూమన్ మైండ్’ పేరిట నిర్వహించిన సింపోజియంలో ఆమె మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు ప్రజల నమ్మకం, భయం, అత్యాశ వంటి మానసిక అంశాలను ఉపయోగించుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
సైబర్ మోసాల నెట్వర్క్లు అత్యంత ఆధునిక పద్ధతుల్లోకి మారాయని, వీటిలో అనేక కార్యకలాపాలు వియత్నాం, మయన్మార్, కంబోడియా వంటి దేశాల నుంచి నిర్వహిస్తున్నారని తెలిపారు. గత రెండేండ్లలో సైబర్ మోసగాళ్ల చేతుల్లో ప్రజలు కోల్పోయిన రూ.455 కోట్లను రికవరీ చేసినట్టు ఆమె తెలిపారు.