హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మదింపు అనంతరం పోర్టల్ ద్వారా జారీచేసిన నోటీసుల్లో డిజిటల్ సంతకం కనిపించకపోయినా అవి చెల్లుబాటవుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ నిబంధనలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పోర్టల్ ద్వారా జారీచేసిన నోటీసులను చెల్లుబాటయ్యేవిగా పరిగణించాల్సి ఉంటుందని తేల్చింది. ఈ క్రమంలోనే జీఎస్టీ నోటీసుల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 500కుపైగా పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ఫుల్ బెంచ్ బుధవారం తీర్పు వెలువరించింది.
కాగా, జీఎస్టీ మదింపు అనంతరం బకాయిల వసూలుకు జారీచేస్తున్న నోటీసులపై సంతకాలు లేవంటూ గతంలోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సంతకాలతో నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే ఇదే అంశంపై మరిన్ని పిటిషన్లు దాఖలవడంతో ఫుల్ బెంచ్ విచారణ చేపట్టింది. దీంతో జీఎస్టీ అధికారులు నిరుడు సెప్టెంబరు 18న కోర్టు ముందు హాజరై పోర్టల్ పనితీరును వివరించారు. అయినప్పటికీ కంప్యూటర్ ద్వారా నోటీసులు జారీచేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించడంతో నిబంధనల ప్రకారం డీఆర్ సీ-07 నోటీసులపై సంతకం తప్పనిసరిగా ఉండాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదనను సమర్థిస్తూ హైకోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది.