న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : నిధుల సమీకరణకు పెద్ద ఎత్తున కంపెనీలు పోటీపడుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల జాతర ఖాయంగానే కనిపిస్తున్నది. కేవలం రెండు రోజుల్లో 12 సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి మరి. ఈ క్రమంలోనే క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. వీటిలో రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, అదానీ గ్రూప్‌నకు చెందిన విశాఖ రెన్యువబుల్స్, రియల్ ఎస్టేట్ కంపెనీ శ్రీజీకృప ప్రాజెక్ట్స్, కన్జ్యూమర్ అప్లియెన్సెస్ తయారీదారు వర్ధమాన్ అప్లియెన్సెస్తోపాటు వాద్వా గ్రూప్ హోల్డింగ్స్, పయనీర్ ఫ్యాబ్రికేటర్స్, పెంటాకిల్ కన్సల్టెంట్స్ (ఐ) లిమిటెడ్, టెంటీ లిమిటెడ్, పీసీఐ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, సంఘ్వీ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొమాయ్ ఆర్ట్, బయోకాన్ ఎలక్ట్రిక్ సంస్థలున్నాయి.
ఇవన్నీ మంగళ, బుధవారాల్లోనే ఫైలింగ్ చేయడం విశేషం. ఇక వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు ఈ ఐపీవో నిధులను ఆయా కంపెనీలు వినియోగించుకోనున్నాయి. కాగా, వాద్వా గ్రూప్ హోల్డింగ్స్ కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్ రూట్లో ఐపీవో పత్రాలను సెబీకి దాఖలు చేసింది. దీంతో ఈ ప్రక్రియ చివరి దశకు చేరేదాకా సదరు కంపెనీ నిధుల సమీకరణ ఎంత? అన్న వివరాలు తెలియకుండా ఉన్నాయి.
