చౌటకూర్, సెప్టెంబర్ 30: విద్యుత్తు కోతలపై రైతులు ఆగ్రహించారు. కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయంటూ ఆక్రోశిస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను బుధవారం ముట్టడించారు. మండలంలోని కోర్పోలు గ్రామానికి చెందిన రైతులు సబ్‌స్టేషన్‌కు తరలివచ్చి సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు.
ఓ వైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి సాగునీరు అందుబాటులో లేదని, మరో వైపు కరెంట్ కోతల కారణంగా పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొంటూ సిబ్బందిపై మండిపడ్డారు. రెకలు ముకలు చేసుకొని సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు.
జోగిపేట ట్రాన్స్‌కో డీఈఈ తమ్మ శ్రీనివాసరావు, ఏడీఈ గండూరి శ్రీనివాస్ సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. 12 గంటలపాటు నిరంతరాయం విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉండగా, 6 గంటల మాత్రమే సరఫరా చేస్తున్నారని, అందులోనూ కోతలు విధిస్తున్నారంటూ రైతులు వారిని ఘెరావ్ చేశారు. జోగిపేట సీఐ అనిల్‌కుమార్, పులల్ ఎస్సై నల్లా విశ్వజన్ పోలీసు సిబ్బందితో సుల్తాన్‌పూర్‌కు చేరుకున్నారు. వారం రోజుల్లో సమస్య పరిషారం కాకపోతే జాతీయ రహదారిని దిగ్బందిస్తామని రైతులు హెచ్చరించారు.