అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అరకొర సేవలే అందుతున్నాయి. ఆ శాఖలో ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగాతయారైంది. టీచర్లకు చుట్టుపక్కల కేంద్రాల బాధ్యతలు సైతం అప్పగిస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై ‘అదనపు భారం’ పడడంతో మానసికంగా వారు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లక్ష్యం నీరుగారిపోతున్నది.
– అశ్వారావుపేట, అక్టోబర్ 26
చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సిబ్బంది కొరత వేధిస్తున్నది. ఖాళీలను భర్తీ చేయకుండా సర్దుబాటు చర్యలతో సరిపెడుతుండడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతున్నది. పక్క కేంద్రాల సిబ్బందిని సర్దుబాటు చేస్తుండడంతో రెండు కేంద్రాలకు న్యాయం చేయలేక పని ఒత్తిడితో నలిగిపోతున్నారు. కేంద్రాలు మూతపడకుండా నామమాత్రంగా విధులు ముగించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పనికి మించిన భారంగా మారింది. ఆయాలు లేనిచోట అంగన్వాడీ టీచర్లే పిల్లలకు భోజనం తయారు చేస్తున్నారు. టీచర్లు లేనిచోట పిల్లలు ఖాళీగా కూర్చొని ఆడుకుంటున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో పనిచేస్తున్న సిబ్బందికి అదనపు పనిభారం తప్పడంలేదు. ప్రతిరోజూ ఆయాలు ఇంటి నుంచి పిల్లలను కేంద్రాలకు తీసుకొచ్చి వంటచేసి వడ్డించడం, తిరిగి పిల్లలను ఇండ్లకు పంపించడం చేస్తుంటారు. ఇక టీచర్ విద్యాబుద్దులతోపాటు ప్రీ స్కూల్ సమయంలో ఆటలు నేర్పిస్తుంది. కానీ కొన్ని కేంద్రాల్లో ఆయాలు లేకపోవడంతో వారి బాధ్యతలను టీచర్లే చేస్తున్నారు.
దీంతో సమయంలేక పిల్లలకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నారు. ఇక టీచర్లు లేని కేంద్రాల్లో విద్యాబోధన అందడం లేదు.. ఆయాలు పిల్లలను చూసుకుంటూ వంట చేసి వడ్డించి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇన్చార్జి బాధ్యతలు మోస్తున్న టీచర్లు వారంలో ఒకటీ రెండ్రోజులు ఆ కేంద్రాలకు వెళ్తున్నారు. కేంద్రాలు దూరం కావడంతో వచ్చి వెళ్లడానికే సమయం సరిపోతుందంటూ టీచర్లు చెబుతున్నారు. ఖాళీలను భర్తీ చేసి అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు సేవలు అందుతున్నాయి. మూడేళ్లలోపు పిల్లలకు బాలామృతం, కోడిగుడ్లు, పాలు పంపిణీ, ఆరేళ్లలోపు పిల్లలకు పప్పు, ఆకుకూరలతో భోజనం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సంరక్షణ చర్యలు తదితర కార్యక్రమాలు ప్రతిరోజూ జరుగుతుంటాయి. విద్యార్థులకు ఆట వస్తువులతో పూర్వ ప్రాథమిక విద్యను టీచర్లు అందిస్తారు. సిబ్బంది కొరత కారణంగా చాలా కేంద్రాల్లో ఈ సేవలన్నీ సక్రమంగా అందడం లేదు.
ఆయా లేకపోవడంతో అదనపు పనులు చేయడం చాలా భారంగా ఉంటోంది. ఇండ్లకు వెళ్లి పిల్లలను కేంద్రాలకు తీసుకురావడంతోపాటు వంట చేసి వడ్డించటం, పిల్లలను తిరిగి ఇండ్లకు పంపించే బాధ్యత టీచర్లపైనే పడుతున్నది. దీనివల్ల ప్రీ స్కూల్ నిర్వహించలేకపోతున్నాం. టీచర్లు లేని కేంద్రాలకు ఇన్చార్జి బాధ్యతలతో మరింత ఇబ్బందికరంగా ఉంది.
– బి.ద్వారకాబాయి, అంగన్వాడీ టీచర్, నారంవారిగూడెం
మా కేంద్రంలో అంగన్వాడీ టీచర్ లేరు. పక్క ఊరు కేంద్రం నుంచి వారంలో ఒకటీ రెండ్రోజులు వచ్చి వెళ్తారు. పిల్లలను కేంద్రాలకు తీసుకొచ్చి వంట చేసి భోజనం వడ్డిస్తున్నాను. సాయంత్రం తిరిగి ఇండ్లకు పంపిస్తాను. మిగతా రోజుల్లో పిల్లలకు విద్యాబోధన అందడం లేదు. ఖాళీలను భర్తీ చేస్తే బాగుంటుంది.
– నాగలక్ష్మి, ఆయా, నారంవారిగూడెం కాలనీ