చర్ల, ఆగస్టు 30: మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడి గిరిజన బిడ్డలకు వైద్యం అందడం గగనం. కిలోమీటర్ల దూరం నడిస్తేనే పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి చేరుకునేది. అంతంతమాత్రంగా వైద్యం అందేది. ఒక దశలో ఆరోగ్యం విషమించి రోగులు ప్రాణాలు వదిలిన సందర్భాలూ ఉన్నాయి. ఇదంతా గత ప్రభుత్వాల హయాంలో పరిస్థితి. కానీ.. తెలంగాణ వచ్చిన తర్వాత రోగులకు మెరుగైన వైద్యం అందుతున్నది. ఈ క్రమంలోనే చర్ల(కొయ్యూరు) పీహెచ్‌సీని 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అభివృద్ధికి రూ.10.70 కోట్లు కేటాయించింది. ఇక ఏజెన్సీ ప్రాంత రోగులకు ఖరీదైన వైద్యం ఇక్కడే అందనున్నది.
తెలంగాణ రాకముందు పాలకుల నిర్లక్ష్యంతో చర్ల పీహెచ్సీ శిథిలావస్థలో కొట్టుమిట్టాడేది. సుదూర ప్రాంతాల నుంచి రోగులు ఆస్పత్రికి వచ్చినా సరిగా వైద్యం అందకపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాలతోపాటు వైద్య రంగంపైనా దృష్టి సారించారు. పల్లెలు, పట్టణాల్లో కొత్తగా దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. వైద్యులు, సిబ్బందిని నియమిస్తునానరు. సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీ చెక్కులు, ఆరోగ్య మిత్ర, ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి రూ.లక్షలు కుమ్మరించినా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందని వైద్య సౌకర్యాలు, సదుపాయాలు నేడు సర్కార్ దవాఖానల్లో అందుతున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులు ప్రజలకు మరింత చేరువయ్యాయి. ఇదే కోవలో సర్కార్ భద్రాద్రి ఏజెన్సీలోని చర్ల (కొయ్యూరు) పీహెచ్‌సీని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసుపత్రి అభివృద్ధికి రూ.10.70 కోట్లు కేటాయించింది.
గతంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు..
చర్ల మండలం మనకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దు ప్రాంతం. చర్ల ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేకపోవడంతో గతంలో గిరిజనులు అనేక ఇబ్బందులుపడ్డారు. చర్ల మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆసుపత్రి. 2006 వరకు ఆసుపత్రికి సొంత భవనం లేదు. ఆసుపత్రి పేరుకు సీమాక్ సెంటరే కానీ అక్కడ సరైన వైద్యం అందేది కాదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే సర్కార్ ఆసుపత్రిని పీహెచ్సీగా మారింది. గర్భిణులు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేది కాదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చేది. తరలిస్తున్న క్రమంలో ఎంతోమంది ప్రాణాలొదిలిన సందర్భాలున్నాయి. పూర్వ కలెక్టర్ అనుదీప్ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి కలెక్టర్ నిధుల నుంచి రు.1.30 లక్షలు మంజూరు చేయించి శిథిలమైన భవనాలను తొలగించి కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనేకసార్లు ఆసుపత్రిని సందర్శించారు. పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతిత్వరలో అప్‌గ్రేడ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తయి అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో సుమారు లక్ష మందికి పైగా వైద్యసేవలు అందనున్నాయి.
త్వరలో పనులు షురూ..
పూర్తి ఏజెన్సీలోని చర్ల పీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ మంచి నిర్ణయం తీసుకున్నది. త్వరలో ఆసుపత్రి అభివృద్ధి పనులు మొదలవుతాయి. కలెక్టర్ ఫండ్ నుంచి నిర్మించిన సిమాక్ సెంటర్లో త్వరలో వైద్యసేవలు ప్రారంభిస్తాం. డయాగ్నస్టిక్ సెంటర్, మార్చురీ గది నిర్మిస్తాం.
– రవిబాబు, డీసీహెచ్ఎస్, భద్రాద్రి జిల్లా