భద్రాద్రి జిల్లాలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు, వాహనదారులు గాయాల పాలవుతుండడం నిత్యకృత్యమైంది. నాసిరకం రోడ్లన్నీ నెలల తరబడి నరకం చూపిస్తున్నాయి. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, కొత్తగూడెం, జూలూరుపాడు రోడ్లు మరింత దారుణంగా ఉన్నాయి. ఒకవైపు అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్న ఇసుక లారీల వల్ల రహదారులన్నీ ధ్వంసమవుతున్నాయి. మరోవైపు అధిక వర్షాల వల్ల ఆ రహదారులపై భారీ గుంతలు పడుతున్నాయి. రెండూ కలిసి ప్రయాణికులు, వాహనదారుల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. అయినా, నిత్యం ఇవే మార్గాల్లో ప్రయాణించే కాంగ్రెస్ పాలకులు కనీసం ఈ రహదారుల గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలలుగా భద్రాద్రి జిల్లా రహదారులపై జనం నరకం చూస్తున్నారు. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా దాదాపు అన్ని మండలాల్లోనూ ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. అడుగుకో గుంత ఉందంటే ఆశ్చర్యమే లేదు. వీటిల్లో పడి వాహనాలూ దెబ్బతింటున్నాయి. వాహనదారులూ గాయాలపాలవుతున్నారు. ఇక బస్సుల్లోని ప్రయాణికులైతే ఎగిరి పడుతున్నారు. కార్లు, ఆటోల వంటి వాహనాలు వారానికి ఒకసారి షెడ్డుకు వెళ్లాల్సిన స్థితికి చేరుకుంటున్నాయి.
ఇటు ఇసుక లారీలు.. అటు భారీ వర్షాలు
వరదలు తగ్గడంతో ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమ ఇసుక రవాణాకు దళారులు బరితెగించారు. అక్రమ ఇసుక, సక్రమ ఇసుక అంతా కలిసి భారీ వాహనాల్లో అధిక లోడుతో వెళ్తోంది. ఇలా ఇసుకను తీసుకెళ్తున్న భారీ వాహనాల వల్ల రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. చర్ల-మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. ఈ రహదారుల్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్లపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భారిన పడడం నిత్యకృత్యంగా మారింది.
బీఆర్ఎస్ నేతల సెల్ఫీ క్యాంపెయిన్..
జిల్లాలో రహదారుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సెల్ఫీ క్యాంపెయిన్ నిర్వహించారు. ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ నేతలు నడుం బిగించారు. ఏ రహదారిపై గుంతలున్నా, ఏ రహదారి ధ్వంసమై కన్పించినా అక్కడ సెల్ఫీలు దిగి ప్రభుత్వానికి పంపారు. అక్కడ నిరసనలు తెలుపుతూ, నినాదాలు చేస్తూ రహదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమయ్యారు. మరోవైపు సీపీఎం నాయకులు కూడా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రికి రోడ్ల సమస్యలపై ఇటీవల వినతిపత్రం అందించారు.
ఇసుక లారీల వల్లే రోడ్ల డ్యామేజీ..
పగలూ రాత్రీ తేడా లేకుండా అధిక లోడుతో తిరుగుతున్న ఇసుక లారీల వల్లే ఈ రహదారులు ఇంతలా ధ్వంసమయ్యాయి. ఇంతటి దారుణమైన రహదారులను చూస్తేనే భయమేస్తోంది. ప్రయాణమంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఏ రహదారిపై చూసినా పెద్ద పెద్ద గుంతలు. మణుగూరు-భద్రాచలం-కొత్తగూడెం రహదారులపై ప్రయాణమంటే నరకమే.
-కుర్రి నాగేశ్వరరావు, మణుగూరు
మా ఊరిలో మరీ దారుణం..
నేను ఆటో నడుపుతాను. మా ఊరిలో రోడ్లు మరీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఇటు భద్రాచలంవైపు వెళ్లినా, అటు చర్ల వైపు వెళ్లినా మధ్యలో ఆటో ఎక్కడ దెబ్బతింటుందోనన్న గుబులు వదలడం లేదు. ఆటో పార్ట్స్ డ్యామేజీ అవుతుండడం వల్ల రోజూ షెడ్డుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఆటోలో ప్రయాణించాలన్నా కూడా ప్రయాణికులు భయపడుతున్నారు. ఒళ్లు హూనమవుతోందంటున్నారు.
-డేగల వినోద్‌రావు, చెలక దంతనం, దుమ్ముగూడెం
మరమ్మతులు చేయిస్తాం..
వర్షాలు, వరదల వల్ల డ్యామేజీ అయిన రోడ్లకు కలెక్టర్ నిధులు విడుదల చేశారు. ఆర్అండ్బీ నుంచి కూడా గ్రాంట్ వచ్చింది. టెండర్లు పిలిచాం. రూ.రెండు కోట్ల నిధులు వచ్చాయి. అన్ని రోడ్లకూ మరమ్మతులు చేయిస్తాం. వర్షాలు ఆగడం లేదు. వర్షంలోనే రిపేర్లు చేస్తే ఫలితం ఉండదు. ఈ నెలలో రోడ్ల మరమ్మతులు మొదలు పెడతాం. ఇసుక లారీల వల్లే ఎక్కువ రోడ్లు ధ్వంసమయ్యాయి.
-వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ