‘మాది ప్రజా పాలన’ అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. నిజంగా ప్రజలు ఉండాల్సిన చోట వారిని ఉండనీయడం లేదు. ప్రజలను పక్కకు నెట్టి వారే కుర్చీలు వేసుకొని మరీ కూర్చుంటున్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకేనని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇందిరమ్మ కమిటీల్లో ఈ విషయం మరింతగా స్పష్టమవుతోంది.
అసలైన పేదలు ఉండాల్సిన ఈ కమిటీల్లో అధికార పార్టీ నాయకులే నిండిపోతున్నారు. ముగ్గురు మంత్రుల అనుయాయులు ఈ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. కమిటీల్లో తమ వారే ఉండాలంటూ ముగ్గురు మంత్రుల వర్గీయులు ఎవరికి వారు పట్టుబడుతున్నారు. ఈ ఒత్తిళ్లతో అధికారులు నలిగిపోతున్నారు. దీంతో వారు చెప్పిన పేర్లతోనే కమిటీల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఆ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలను వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం.. గ్రామాల్లో పంచాయతీ కమిటీలను, పట్టణాల్లో మున్సిపల్ వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తోంది. గ్రామాల్లో అయితే సర్పంచ్ చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. పట్టణాల్లో అయితే మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. వీరి సమక్షంలో ఉండే కమిటీల్లో ఐదుగురు సభ్యులు ఉంటారు.
ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు; స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి ఇద్దరు ఉంటారు. ఇప్పుడు పంచాయతీలకు పాలకవర్గాలు లేనందున అక్కడి ప్రత్యేకాధికారే చైర్మన్‌గా ఉంటారు. పంచాయతీ ఎన్నికలయ్యాక వచ్చే నూతన సర్పంచే చైర్మన్ అవుతారు. అయితే ఇప్పుడు సభ్యుల్లో అందరినీ తమవారినే నియమించుకొని కమిటీలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలని అధికార పార్టీ నేతలు పన్నాగం పన్నారు. గ్రామసభల ద్వారా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా అలా జరగలేదు. ఇప్పటికే రహస్యంగా కమిటీల ఎంపిక పూర్తయింది. ముగ్గురు మంత్రుల అనుయాయులు ఎవరికి వారుగా అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారి పేర్లతో ఇందిరమ్మ కమిటీల జాబితాను తయారు చేయించి ఇన్చార్జి మంత్రికి పంపించారు.
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేదెప్పుడో, లబ్ధిదారులు వాటిల్లో ఉండేదెప్పుడో గానీ.. వాటి కమిటీల్లో తమవారి పేర్లు పెట్టే విషయంలో మాత్రం అధికార పార్టీ నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. బహిరంగంగా కమిటీలు వేస్తే వాటిల్లోని పేర్లు ముందుగానే బయటకు తెలుస్తాయి. దీంతో కమిటీల పంచాయితీ తెగేలా ఉండదు. దీంతో మూడు గ్రూపులు తయారు చేయించుకున్న జాబితాలు ఇన్చార్జి మంత్రి చేతికి వెళ్లాయి. దీంతో చివరికి కమిటీల్లో ఎవరి పేర్లు ఉంటాయోనని మూడు వర్గాల నాయకులు హైరానా పడుతున్నారు.
అయితే, ఈ కమిటీలను ఏకపక్షంగా వేస్తున్నారంటూ చండ్రుగొండ మండలం పోకలగూడేనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకుడు.. సాక్షాత్తూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాడు. చివరికి ప్రెస్‌మీట్ పెట్టిమరీ గ్రూపుల గురించి వివరించారు. కమిటీలన్నింటినీ పొంగులేటి వర్గం వాళ్లతోనే నింపుతున్నారని, తుమ్మల వర్గానికి అవకాశం ఇవ్వడం లేదని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని, అందులో తమకూ స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, అదే గ్రామ కమిటీలో తమకూ చోటు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నాయకులు (బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉన్న స్థానాల్లో) కోరినా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. అయితే అధికార పార్టీ నేతలు ఇచ్చిన పేర్లను గోప్యంగా ఉంచి రాష్ట్రస్థాయికి పంపినట్లు తెలిసింది.
చివరికి బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉన్న చోట కూడా తమ వారి పేర్లే ఉండాలంటూ అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఉదాహరణకు కొత్తగూడెం మున్సిపాలిటీకి బీఆర్ఎస్ చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఇందిరమ్మ కమిటీ చైర్మన్‌గా బీఆర్ఎస్కు చెందిన చైర్పర్సన్/ కౌన్సిలర్ ఉండాలి. కానీ వారిని పక్కన పెట్టి తమ వారినే చైర్మన్‌గా ఉంచాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అక్కడ కొందరు సీపీఐ కౌన్సిలర్లు ఉన్నందున వారి వార్డుల్లో వారే చైర్మన్లుగా ఉండాలి. కానీ వారిని కూడా పక్కకు నెట్టి తాము ఉంటామంటూ కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. దీంతో అక్కడ ఇందిరమ్మ కమిటీల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇక్కడున్న 36 మున్సిపల్ వార్డుల్లో ఒక్కదానికి కూడా కమిటీలు వేయలేదు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో కలిపి 584 కమిటీలు వేయాల్సి ఉంది. ఇందులో 481 గ్రామ పంచాయతీ కమిటీలకుగాను 478 కమిటీలు, 103 మున్సిపల్ వార్డులకుగాను 63 కమిటీలు పూర్తయ్యాయి.
ఇందిరమ్మ కమిటీలను సీక్రెట్‌గా వేశారు. గ్రామసభ కూడా పెట్టలేదు. రహస్యంగా కమిటీలు వేస్తే రేపు ఇళ్లు ఇచ్చేటప్పుడు వారి పార్టీ వాళ్లకే ప్రాధాన్యమిస్తారు. నిజమైన పేదలకు ఇళ్లు రావడం కష్టమవుతుంది. అందుకని, అందరి సమక్షంలోనే కమిటీలు వేయాలి.
-భూపతి రమేశ్, రావికంపాడు, చండ్రుగొండ
అందరినీ సమానంగా కలుపుకుని ఇందిరమ్మ కమిటీలు వేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కమిటీలు వేశారు. దీని గురించి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. అందరికీ ఆమోదయోగ్యంగా కమిటీలు ఉండాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.
-ధరావత్ శివ, యువజన కాంగ్రెస్ నాయకుడు, పోకలగూడెం, చండ్రుగొండ
జిల్లాలో 584 కమిటీలు వేయాల్సి ఉంది. అందులో 39 కమిటీలు పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీల పరిధిలో బూర్గంపహాడ్, పినపాక, కరకగూడెం కమిటీలు, మున్సిపాలిటీల్లో కొత్తగూడెంలోని 36 వార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిల్లో కమిటీలను పూర్తి చేస్తాం.
– వేణుగోపాల్, భద్రాద్రి అదనపు కలెక్టర్