దమ్మపేట రూరల్, జూన్ 23 : హాఫ్ టైపు పామాయిల్ మొక్కలపై ఈనెల 26వ తేదీ నుంచి శాస్త్రవేత్తల బృందం విచారణ చేపట్టనున్నది. ఇందుకోసం ప్రశ్నావళిని కూడా రూపొందించారు. 2016-2022 ఏళ్ల వరకు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడులోని ఆయిల్‌ఫెడ్ నర్సరీల నుంచి ఇచ్చిన మొక్కల్లో 20 నుంచి 50 శాతం వరకు జన్యుపర లోపాలతో హాఫ్ టైపు మొక్కలు రైతుల క్షేత్రాల్లోకి చేరాయి. సాధారణంగా మూడేళ్లు పూర్తయిన తర్వాత పామాయిల్ గెలల దిగుబడి వస్తుంది. అయితే దీనికి భిన్నంగా కాత లేకపోవడం, కాత వచ్చినా అతి తక్కువ పరిమాణంతో గెలలు రావడం.. వంటి సమస్యలను తోటలు వేసి ఏడేళ్లు పూర్తయిన తర్వాత కూడా రైతులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయాన్ని రైతులు ఆయిల్‌ఫెడ్, ఉద్యాన శాఖ అధికారుల దృష్టికి, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ పామాయిల్ గ్రోవర్స్ సొసైటీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైంది. దీంతో సొసైటీ ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. రైతుల బాధను అర్థం చేసుకున్న రవిచంద్ర.. సొసైటీ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా పెదవేగిలోని జాతీయ పామాయిల్ పరిశోధన కేంద్రం విచారణ జరపాలని కేంద్ర వ్యవసాయ మంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.
దీనికి అనుగుణంగా పామాయిల్ పరిశోధన కేంద్రం నుంచి తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు సమగ్ర వివరాలు ఇవ్వాలని సూచిస్తూ ఓ లేఖను పంపించారు. పామాయిల్ రైతుల జాబితా, ఏ రైతుకు ఏ రకం మొక్కలు ఇచ్చారు? ఎంత వయసున్న మొక్కలు ఇచ్చారు? ఏ నర్సరీ నుంచి ఇచ్చారు? ఏ దేశం నుంచి ఎన్ని మొలకలు దిగుమతి చేసుకున్నారు? నర్సరీ ఇన్చార్జి పేరు? తదితర 30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఆయిల్‌ఫెడ్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈనెల 26వ తేదీ నుంచి శాస్త్రవేత్తలతో కూడిన బృందం రైతుల తోటల్లో విచారణ చేపట్టనున్నది.
అయితే తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆయిల్‌ఫెడ్‌లో ప్లాంటేషన్ అధికారి ఆధ్వర్యంలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము అవినీతి నుంచి తప్పించుకుని.. రైతులపై తప్పును నెట్టివేయాలనే కోణంలో నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. నాటి ఆయిల్‌ఫెడ్ ఎండీ నిర్మల విధించిన రూ.40 లక్షల రికవరీ సొమ్మును చెల్లించకుండా కీలక విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి ఈ నివేదికను రూపొందించడంలో సూత్రధారిగా ఉండడం ఆయిల్‌ఫెడ్ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.