ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 23 : ప్రస్తుతానికి ఉన్న పనులతో సతమతమవుతున్న వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే అంటూ ఒత్తిడి చేయడమో.. మరే కారణమోగానీ జిల్లావ్యాప్తంగా మూకుమ్మడి సెలవుల కోసం అర్జీలు సమర్పించారు. ఏఈవోలు ఎంత పని ఉన్నా గడిచిన రెండేళ్లుగా తమ విధులను సమర్థవంతంగా నిర్వరిస్తున్నా.. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఏదో ఒక సర్వే చేయడం, అది ముగియగానే మరో రకమైన పనులను ప్రభుత్వం అప్పగిస్తుండడంతో విసుగు చెందుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేసిన రైతుబీమా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం, రైతు వేదిక వద్ద జరిగే అవగాహన సదస్సులు, క్రాప్ బుకింగ్ సర్వే, పంట కొనుగోలు కేంద్రాల మానిటరింగ్, నకిలీ విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరిశీలనలో ఏవో, ఏడీఏల పర్యటనల్లో పాలుపంచుకోవడం.. ఇలా అనేక రకాల పనులను ఒకవైపు ఆన్లైన్, మరోవైపు ఆఫ్‌లైన్‌లో నిర్వర్తిస్తున్నారు. ఇవి చాలదన్నట్లు ప్రతి సర్వే నెంబర్లో పొల్లుపోకుండా డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని నెల రోజులుగా ఉన్నతాధికారులు తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఇందుకు సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించినప్పటికీ ఇదంతా తమ వల్ల కాదంటూ రోజువారీ విధులను ఏఈవోలు నిర్వర్తిస్తున్నారు. అయితే వారి హాజరు మాత్రం అధికారికంగా నమోదు కాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం రైతుబీమాకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే సాకు చూపుతూ రాష్ట్రవ్యాప్తంగా 165 మంది ఏఈవోలపై ఆయా జిల్లాల వ్యవసాయాధికారులు సస్పెన్షన్ వేటు వేయడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఈవోలను ఏదో విధంగా తప్పించాలనే ఉద్దేశంతో కక్షగట్టి పొరుగు రాష్ర్టాలకు భిన్నంగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ఏఈవోలు మండిపడుతున్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 165 మంది ఏఈవోలపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో ఏఈవోలుగా విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు సర్కార్ ధోరణిపై భగ్గుమన్నారు. దీంతో మూకుమ్మడి సెలవులు పెట్టాలని నిర్ణయించుకొని మంగళవారం సాయంత్రం నుంచి ఆయా డివిజన్లకు చెందిన ఏఈవోలు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులకు మాస్ లీవ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ తంతు బుధవారం ఉదయం వరకు కొనసాగింది. జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలోని ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, పాలేరు డివిజన్ ఏడీఏలను కలిసిన ఆయా డివిజన్‌కు చెందిన ఏఈవోలు రాష్ట్ర ఏఈవోల జేఏసీ పిలుపు మేరకు బుధవారం సాయంత్రం వరకు 99 క్లస్టర్లకు చెందిన ఏఈవోలు మాస్ లీవ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. దీంతో మెడికల్ లీవ్, ఇతర సెలవులపై ఉన్నవారు, ఆత్మ ప్రాజెక్టు ఏటీఎం, బీటీఎంలు మినహా మిగిలిన వా రంతా మూకుమ్మడిగా సెలవులు పెట్టినైట్లెంది.
అనంతరం అందుబాటులో ఉన్న పలువురు ఏఈవోలు రాష్ట్ర ఏఈవోల జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పంతాలకు పోకుండా తమ విధి నిర్వహణ విషయంలో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలన్నారు. తమకు ఒక సహాయకుడిని నియమిస్తే తామే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం చెప్పే పనులన్నీ వరుస క్రమంలో చేస్తున్నా.. అదనంగా డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని నెల రోజులుగా ఉన్నతాధికారులు తీవ్రమైన ఒత్తిడి తేవడం ఏమిటని పలువురు ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. తమకు పనిభారం తగ్గించాలని కోరుతూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు బుధవారం మూకుమ్మడి మాస్ లీవ్‌ల కోసం దరఖాస్తులు సమర్పించారు. జిల్లాలో 67 మంది ఏఈవోలు విధులు నిర్వర్తిస్తున్నారు.
పెద్ద జిల్లా కావడంతో పంటల విస్తీర్ణం కూడా 5 లక్షల ఎకరాలకు పైగానే ఉంది. గతంలో వారు విధుల్లో చేరినప్పుడు 4 లక్షల ఎకరాల వరకే ఉండేది. రానురాను ధరణిలో వచ్చిన మార్పులు, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో ఏఈవోలకు పనిభారం పెరిగింది. గతంలో పంటల సర్వే చేయాలంటే సర్వే నెంబర్ల ఆధారంగా పంటల నమోదు చేయడం సులువయ్యేది. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్రాప్ బుకింగ్ సర్వేపై ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడంతో వారంతా అభ్యంతరం తెలపడంతోపాటు మూకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.