ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. ఏ సర్వీస్‌కు ఎంత? అనే బోర్డులు ఆధార్ సెంటర్లలో ఎక్కడా కనిపించవు.. దీంతో ఇష్టారాజ్యంగా అందినకాడికి దోచుకుంటున్నారు. అవసరం కావడంతో ప్రజలూ అడిగినంత ఇచ్చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకానికీ ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు జారీ ప్రక్రియ సామాన్య ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతున్నది. సులభతరంగా అందించాల్సిన సేవలకు ఆధార్ సెంటర్ నిర్వాహకులు ‘రేట్’ ఫిక్స్ చేసి మరీ దండుకుంటున్నారు. ఆధార్ సేవలకై కేంద్రాలను ఆశ్రయిస్తే నిర్వాహకుల చేయి తడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడిగినంత ఇచ్చుకోకుంటే రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆధార్ కార్డుల జారీ, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ మార్పిడితోపాటు బయోమెట్రిక్ అప్డేషన్ వంటి సేవలను పొందేందుకు ప్రజలు పెద్దఎత్తున ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ ప్రక్రియను అమలు చేయడంతో కార్డులోని ప్రతి ఒక్కరికీ ఆధార్ అప్డేట్ చేయించుకోవడం తప్పనిసరైంది. దీంతో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం తమ పిల్లల ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి ఆధార్ కేంద్రాల బాట పడుతున్నారు. ఫలితంగా ఆధార్ సెంటర్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మార్చుకున్న కేంద్రాల నిర్వాహకులు ప్రతి ఆధార్ కార్డుదారుడి వద్ద రూ.100 వసూలు చేస్తున్నారు. ఒక్క రేషన్ కార్డులో ఐదుగురు సభ్యులుంటే రూ.500 సమర్పించుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
ఆధార్ కేంద్రాల దోపిడీపై దృష్టి సారించాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఫలితంగా ఆధార్ కేంద్రాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏదైనా అవసరం నిమిత్తం ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చాలంటే ఇక వేలల్లో సమర్పించుకోవాల్సిదేనని ప్రజలు వాపోతున్నారు. పుట్టిన తేదీకి సంబంధించిన పత్రాలు లేకుంటే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకొని పని చక్కదిద్దుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలాలతో పోల్చితే ఖమ్మం నగరంలోని ఆధార్ సెంటర్ల దోపిడీ విపరీతమైనట్లు నగర ప్రజలు వాపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఆధార్‌లోని మార్పులు చేర్పుల కోసం కేంద్రాలకు రావడంతో నిర్వాహకుల పంట పండుతోంది. కేంద్రంలోని ప్రతి పనికీ రూ.100 చొప్పున అడుగుతుండడంతో ప్రజలు మారుమాట్లాడకుండా అడిగింది చేతిలో పెట్టి వెనుతిరుగుతున్నారు. రెవెన్యూ అధికారులు ఉండే జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నగరంలో ఆధార్ సెంటర్లపై అధికారులు దృష్టి సారించి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకే గుర్తింపు కార్డు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర సర్కార్ ఆధార్ కార్డుల జారీని తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపట్టడంతో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులపై అడ్రస్‌లో రాష్ట్రం పేరు ‘ఆంధ్రప్రదేశ్’ అని వచ్చింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్‌ను కాస్త తెలంగాణగా మార్చుకోవడం రాష్ట్ర ప్రజలకు అనివార్యమైంది. తెలంగాణ అని మార్చుకోవడం కోసం కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కేంద్రాల బాట పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణగా మార్చినందుకు సైతం ఆధార్ సెంటర్ల నిర్వాహకులు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందుకు ఇంటి ధ్రువీకరణ పత్రం ఉంటేనే చేస్తున్నారు. అయితే రాష్ట్రం పేరు తెలంగాణగా మార్పు చేసుకోవడం అందరికీ తప్పనిసరి కాబట్టి ఆధార్ కేంద్రాల్లో ఉచితంగా సేవలు అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఇదిలాఉంటే.. ఇంటర్నెట్ సెంటర్లలో సైతం ఆధార్‌లోని అడ్రస్ మార్చుకోవడం, గార్డియన్(తండ్రి, భర్త) పేరు మార్చుకోవడం వంటి కొన్ని సేవలు పొందవచ్చు.. ఈ విషయం తెలియక అనేక మంది ఆధార్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు.
ఆధార్ కేంద్రాల నిర్వాహకులు నిబంధనల మేరకే డబ్బులు తీసుకోవాలి. రూ.50 సర్వీస్‌కు రూ.100 తీసుకోవడం నేరం. ఆకస్మిక తనిఖీలు చేపడుతాం. అదనపు వసూళ్లకు పాల్పడే నిర్వాహకులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.