భద్రాచలం, జూలై 15 : అత్యంత వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్న తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంకు చెందిన ఆదివాసీ కొండరెడ్లు భద్రాచలం ఐటీడీఏ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ముర్ల రమేశ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడి ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న కొండ రెడ్లకు కనీస సౌకర్యాలు కల్పించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గూడేల్లో విద్యుత్, తాగు, సాగునీరు, రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు కనీసం ఉండేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పీవో బి.రాహుల్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉప్పిశెట్టి రవీందర్రెడ్డి, బొల్లి దాసిరెడ్డి, ఉప్పిశెట్టి మంగారెడ్డి, గురుగుంట్ల నాగమణి, ఉప్పిశెట్టి దుర్గమ్మ, ఉప్పిశెట్టి కన్నపురెడ్డి, పూజారి చిన్నపరెడ్డి, చుకమ్మ, జ్యోతి, మంగమ్మ పాల్గొన్నారు.