ముంబై: శ్రీలంక పర్యటనకు బయల్దేరేముందు భారత టెస్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ స్పిన్‌తో కుస్తీలు పట్టారు. ఆది, సోమవారాల్లో ఈ ఇద్దరూ ముంబై బాంద్రాలోని ఓ స్పోర్ట్స్ సెంటర్లో స్పిన్‌ను మెరుగ్గా ఆడేందుకు తీవ్రంగా శ్రమించారు. లంకతో సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ముంబై స్పిన్నర్ తనుష్ కొటియాన్‌తో పాటు మరికొంతమంది లోకల్ స్పిన్నర్లతో ఓపెనింగ్ ద్వయం నెట్స్‌లో చెమటోడ్చింది. గతంలో స్పిన్‌ను అలవోకగా ఎదుర్కునే భారత బ్యాటర్లు.. గడిచిన రెండేండ్లుగా స్వదేశంలో ప్రత్యర్థుల స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతూ తీవ్ర విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. రాబోయే లంక సిరీస్ సైతం టీమిండియాకు కఠిన సవాలే. ఆ జట్టులో ప్రభాత్ జయసూర్య తన స్పిన్ మాయాజాలంతో ముప్పుతిప్పలు పెట్టగల సమర్థుడు. దీంతో భారత ఓపెనర్లు అతడిని నిలువరించేందుకు ప్రత్యేకంగా స్పిన్‌పైనే ఫోకస్ పెట్టారు.
నెట్ బౌలర్లుగా నలుగురు స్పిన్నర్లు..
లంకతో సిరీస్‌లో స్పిన్‌ను మెరుగ్గా ఎదుర్కునేందుకు గాను బీసీసీఐ.. జట్టుతో పాటు నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపికచేసింది. కొటియాన్ (ఆఫ్ స్పిన్), విప్రాజ్ నిగమ్ (లెగ్ స్పిన్), శివాంగ్ కుమార్ (లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), హర్ష్ దూబే (లెఫ్టార్మ్ ఆర్తోడాక్స్).. నెట్స్‌లో గిల్ సేనకు పరీక్ష పెట్టనున్నారు. ఇప్పటికే జట్టులో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సారాంశ్ జైన్ ఉండగా ఈ నలుగురినీ నెట్ బౌలర్లుగా పంపించడం గమనార్హం. ఇదిలాఉండగా మంగళవారం సాయంత్రం భారత జట్టు కొలంబోలో దిగింది. లంకతో టెస్టు సిరీస్ ఈనెల 15 నుంచి మొదలుకానుంది.