ఖైరతాబాద్, ఆగస్టు 4: రాష్ట్రంలోని కురుమల సమగ్రాభివృద్ధి కోసం రూ.1000 కోట్ల కార్పస్ ఫండ్‌తో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కురుమలు 30లక్షలకు పైగా ఉంటారని, కానీపథకాల్లో తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నారు.
జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లు, కమిషన్లు, బోర్డులు, సలహా మండళ్లలో ప్రాతినిధ్యం కల్పించాలని, స్థానిక సంస్థలు, శాసనసభ, మండలిలో రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని విస్తరించి, ఆధునిక శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. సబ్సిడీ రుణాలు, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు పెంచాలన్నారు. ఈ సమావేశంలో ఐలయ్య, సాంబయ్య, చంద్రమోహన్, రమేశ్, సైదులు, శేఖర్, రాజు, శంకర్, ఉపేందర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.