చౌటుప్పల్, సెప్టెంబర్ 22 : కరెంట్ కోతలపై రైతులు భగ్గుమన్నారు. నిత్యం అనేక జిల్లాల్లో రైతులు సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. మంగళవారం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలుచోట్ల సబ్స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని విద్యుత్తు శాఖ డీఈ కార్యాలయాన్ని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముట్టడించారు. రోజుకు ఎన్ని గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నారని డీఈని నిలదీశారు. డీఈ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అక్కడ ఉన్న విద్యుత్తు కార్యాలయాలకు తాళాలు వేసి డీఈ ఆఫీస్‌కు కూడా తాళం వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ.. అబద్ధాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మెడకు ఉరితాడుగా మారిందని విమర్శించారు. విద్యుత్తు అందిస్తే రైతులు సక్రమంగా పంటలు సాగు చేస్తారని, పంటలు వేస్తే యూరియా ఇవ్వాలని, వడ్లు కొనాల్సి వస్తుందనే దురుద్దేశంతోనే కరెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇలా చేస్తే రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు.