నమస్తే తెలంగాణ క్రీడా విభాగం ; జమ్మూ కశ్మీర్ పేరు వినగానే ఎవరికైనా మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పచ్చటి మైదానాలు, ఆహ్లాదాన్ని పంచే అందమైన లోయలే గుర్తొస్తాయి. కానీ, కొన్ని రోజులుగా భారత క్రికెట్లో మాత్రం ఓ యువకుడి పేరు మారుమోగుతోంది. తన బౌలింగ్ పదునుతో దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపి.. ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీలో జమ్మూను తొలిసారి విజేతగా నిలిపి అందరి మన్ననలూ అందుకున్న పేసర్ ఆకిబ్ నబీ ఇప్పుడు భారత టెస్టు జట్టులోకి వచ్చి సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. తన పదునైన సీమ్, స్వింగ్ బౌలింగ్‌తో ఇతర రాష్ర్టాల బ్యాటర్లను బెంబేలెత్తించిన నబీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. జమ్మూ నుంచి ఇప్పటికే పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ టీమిండియా గడపతొక్కగా.. ఇప్పుడు ఆకిబ్ మరో అడుగు ముందుకేసి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ రాష్ట్ర తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే, అతని ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. బస్సు చార్జీలకు డబ్బుల్లేక.. స్నేహితుల బూట్లు అడుక్కొని క్రికెట్ ఆడిన రోజుల నుంచి సరైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు లేని ప్రాంతంలో ఎన్నో కష్టాలు, ప్రతికూలతలు దాటుకొని జాతీయ జట్టులోకి వచ్చాడు.
తండ్రితో పోరాడి.. బంతి పట్టి
బారాముల్లా జిల్లా శీరి అనే చిన్న గ్రామానికి చెందిన ఆకిబ్ నబీ తండ్రి గులామ్ నబీ దార్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. కొడుకు చదువు పూర్తి చేసి డాక్టర్ కావాలని ఆయన ఆశపడ్డాడు. కానీ, నబీకి మాత్రం పుస్తకాలతో కుస్తీ కంటే మైదానంలో బ్యాటు, బంతితో ఆట అంటేనే ఎక్కువ ఇష్టం. క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ ఆడి తండ్రితో తిట్లుతినేవాడు. ఇంటర్మీడియట్ బయాలజీ పరీక్షల సమయంలో ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ నేతృత్వంలో చెన్నైలో జరిగిన బీసీసీఐ పేస్ బౌలింగ్ క్యాంప్‌నకు ఆకిబ్ ఎంపికయ్యాడు. పరీక్షలు వదిలి చెన్నై వెళ్లడానికి తండ్రి మొదట్లో ఒప్పుకోలేదు. కానీ, ఆకిబ్ తొలి క్లబ్ కెప్టెన్ జుబేర్ దార్ అతని అపార ప్రతిభను తండ్రికి విడమరిచి చెప్పాడు. చివరికి కొడుకు కలను నెరవేర్చడానికి గులామ్ నబీ రూ. 10 వేలు అప్పు చేసి, ఆకిబ్‌ను విమానంలో చెన్నై పంపించాడు. ఆ ఒక్క నిర్ణయమే ఆకిబ్ జీవితాన్ని, జమ్మూ క్రికెట్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది.
దోస్తు బూట్లతో బౌలింగ్
క్రీడా జీవితం ఆరంభంలో బారాముల్లా ఆటగాడు ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. మొదట్లో తనకు ఆట తప్ప ఏమీ తెలిసేది కాదు. తను ఎంత అమాయకంగా ఉండేవాడంటే, క్లబ్ క్రికెట్ ఆడటానికి రూ. 10 కట్టాలా? అని అడిగేవాడు. తొలిసారి శ్రీనగర్‌లోని షేర్-ఈ-కశ్మీర్ మైదానంలో టర్ఫ్ వికెట్‌పై ఆడుతున్నప్పుడు రాత్రంతా నిద్రపోలేదు. తీరా మైదానంలోకి దిగాక మొదటి బంతికే జారిపడ్డాడు. కారణం అతడి దగ్గర బౌలింగ్ స్పైక్ షూస్ లేకపోవడమే. సహచర బౌలర్ ఒక ఓవర్ వేసి, తన షూస్ ఇస్తే.. దాంతో ఆకిబ్ బౌలింగ్ చేసేవాడు. మైదానాలు, సదుపాయాలు లేకపోవడంతో రోజువారీ ప్రాక్టీస్ కోసం రోజూ బారాముల్లా నుంచి శ్రీనగర్‌కు 60 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ మాజీ కెప్టెన్ పర్వేజ్ రసూల్, టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రోత్సాహం, మార్గనిర్దేశం లభించడం నబీకి వరమైంది. బౌలింగ్ కోచ్ పి. కృష్ణ కుమార్ శిక్షణలో రాటు దేలాడు. తన బలమైన ఔట్ స్వింగర్‌కు తోడు ఇన్ స్వింగర్లు, ఆఫ్ కట్టర్లను కూడా అమ్ములపొదిలో చేర్చుకొని పర్ఫెక్ట్ బౌలర్‌గా మారాడు. 2024-25 రంజీ సీజన్లో 44 వికెట్లు, ఈ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌పై 4 బంతుల్లో 4 వికెట్ల తో సంచలనం సృష్టించాడు.
ఐపీఎల్లో రూ. 8.4 కోట్లు..
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆకిబ్ నబీని 2026 సీజన్ ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 8.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఒకప్పుడు బస్సు చార్జీలు, షూస్ కోసం కష్టపడిన కుర్రాడు.. ఒక్కరాత్రితో కోటీశ్వరుడు కావడంతో శీరి గ్రామంలోనే కాకుండా లోయ అంతటా సంబరాలు అంబరాన్ని తాకాయి. చూస్తుండగానే నబీ ఇప్పుడు భారత టెస్టు బెర్త్ సాధించాడు. చదువును వదిలి క్రికెట్ బంతి పట్టినందుకు బాధపడ్డ తండ్రిని నేడు ప్రపంచం ముందు సగర్వంగా తలఎత్తుకునేలా చేసిన ఆకిబ్ కథ.. కష్టాలను జయించి కలలను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకం.
రంజీ ట్రోఫీలో నబీ గెలిచిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు. ఈ సీజన్లోనే మూడుసార్లు ఈ అవార్డు నెగ్గాడు.