హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన షియర్‌జోన్ (వదులైన భూపొరలున్న ప్రాంతం)ను అధిగమించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. దీంతో పనుల వేగం పెరిగిందని తెలిపారు. ఆదివారం ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి సచివాలయంలో సమీక్షించారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పురోగతి, క్షేత్రస్థాయిలోని సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. 2028 జూన్ నాటికి పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. గడిచిన ఐదారు నెలల్లో అవుట్లెట్ వైపు 450 మీటర్లు, ఇన్లెట్ వైపు 250 మీటర్లు మొత్తంగా 700 మీటర్ల మేర సొరంగం తవ్వకం పూర్తయిందని వివరించారు. నవంబర్ నుంచి పనుల వేగం పెరిగే అవకాశం ఉన్నదని చెప్పా రు. 2028 మే-జూన్‌లో రెండువైపు లా సొరంగాలను అనుసంధానించి నీ టిని సరఫరా చేయడమే లక్ష్యమని తెలిపారు. టన్నెల్తోపాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇతర అనుబంధ పనులనూ పూర్తిచేయాలని ఆదేశించారు.