గద్వాల/ఎల్లారెడ్డిపేట/భైంసా టౌన్, అక్టోబర్ 4: పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ కోతలతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు డబ్బులు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పారిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మదనపల్లికి చెందిన రైతు నాగిరెడ్డి గద్వాల పట్టణ సమీపంలో సుమారు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల్లో కంది, మరో నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు.
సరైన వర్షాలు కురువక పోవడంతో నాలుగు ఎకరాల్లో పత్తి పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం కంది పంట పూతదశలో ఉన్నది. కనీసం కంది పంటనైనా కాపాడుకోవాలనే ఆశతో వారం రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పారిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటివరకు సుమారు రూ.42వేలు ఖర్చు చేసినట్టు రైతు నాగిరెడ్డి తెలిపాడు. ఇప్పటికే పంటపై రూ.2 లక్షల వరకు ఖర్చు చేసినట్టు చెప్పాడు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వరతండాకు చెందిన అజ్మీరా లింబానాయక్ తనకున్న నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. ఆయన పొలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్కపేట కెనాల్‌ను ఆనుకుని ఉంటుంది. ప్రస్తుతం బోరుబావిలో నీళ్లు అడుగంటిపోవడం, వారం కిందట ట్రాన్స్ఫార్మర్ చెడిపోయింది.
ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇప్పటికే రెండెకరాల పొలం ఎండిపోయింది. మిగతా పొలాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అల్మాస్పూర్ నుంచి ట్యాంకర్‌కు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి నీళ్లు తెచ్చి పొలానికి పారిస్తున్నడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే 24గంటల కరెంట్ వచ్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నాలుగు గంటలు కూడా సక్కగ ఇస్తలేదని వాపోయాడు. మునుపటి లెక్క కాలువ నీళ్లు వదిలితే పంట చేతికొస్తదని చెప్పుకొచ్చాడు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్‌కు చెందిన రైతు భూమేశ్ తనకున్న రెండెకరాల్లో వరి వేశాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండుతున్నాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కండ్ల ముందే పంటలు వట్టిపోతుంటే చూడలేక రెండు కిలోమీటర్ల దూరం నుంచి ట్రాక్టర్ ద్వారా నీటిని తెచ్చి అందిస్తున్నాడు.

పొలానికి సమీపంలోనే చెరువు ఉన్నా కాలువ ద్వారా నీటిని తీసుకోవాలంటే అధికారుల అనుమతి అవసరమని చెప్తున్నాడు. అధికారులు స్పందించి చెరువు నుంచి కాలువ ద్వారా నీటిని అందించి పంటలను కాపాడాలని రైతు భూమేశ్ కోరుతున్నాడు.