
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికారులకు వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ సీఈఓలకు పలు సూచనలు చేశారు. జీఓ నెం13 ప్రకారం ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆయన సూచించారు. వ్యవసాయశాఖ విస్తరణ అధికారుల ధృవీకరణ తరువాతనే కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.
డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన పొరపాట్లు ఈ సంవత్సరం పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని నిశితంగా పరిశీలించి, సంబంధిత ఏఈఓల ధృవీకరణ ఉంటేనే కొనుగోలు కేంద్రాలకు అనుతించాలన్నారు. మిల్లర్ల నుంచి ట్రాన్స్‌పోర్టు విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి ఏ. విజయకుమారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం విజయనిర్మల, పౌరసంబంధాల అధికారి రాజేందర్, మేనేజర్ సోములు తదితరులు పాల్గొన్నారు.