భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ అధికారి మార్గదర్శకాలు తప్పక పాటించాల్సిందేనని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఆర్వో, ఏఆర్వోలకు బుధవారం నిర్వహించిన శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నోడల్ అధికారులుగా ఉన్న డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, ఎంప్లాయ్మెంట్ అధికారి శ్రీరాం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు నామినేషన్ల స్వీకరణ, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు.
ప్రతీ బాధ్యత ఆర్వో, ఏఆర్వోలపైనే ఉంటుందన్నారు. పోలింగ్ సమయంతోపాటు నామినేషన్ల స్వీకరణ సమయం కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని, ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేశారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఎలాంటి సెలవులు ఉండవని, కొందరు రిజర్వులో ఉన్నా వారు కూడా అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి నిబంధనలు పాటించకపోతే చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్నారు. శిక్షణలో ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు.