బోనకల్లు, ఫిబ్రవరి 4: మండల కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 13 మంది కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావినూతల గ్రామానికి చెందిన 17 మంది వ్యవసాయ కూలీలు ముదిగొండ మండలంలోని బాణాపురంలో మిరప కాయలు గ్రేడింగ్ చేసేందుకు వెళ్లారు. తిరిగి ట్రాక్టర్‌పై వస్తున్నారు. మండలంలోని పెద్దబీరవల్లికి చెందిన ఎండ్రాతి వెంకటేశ్వర్లు(45) బైక్‌పై వస్తూ ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి ట్రాక్టర్ కిందకు దూసుకుపోయాడు.
ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పల్టీ కొట్టింది. ట్రాక్టర్లో ఉన్న 13 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన కూలీలను 108 సిబ్బంది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.