సారపాక, జనవరి 29 : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరినగర్లో సుమారు 600 కుటుంబాల వారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శేషగిరినగర్ డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో గులాబీమయమైంది. బీఆర్ఎస్ మండల, పట్టణ నేతల నాయకత్వంలో శేషగిరినగర్కు చెందిన వార్డు సభ్యులు వేముల లక్ష్మయ్య, వేమూరి రఘు, బూర్గుల సంజీవరావు ఆధ్వర్యంలో సీపీఎం, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రేగా సమక్షంలో పార్టీలో చేరగా వారందరినీ సాదరంగా ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పారు.
శేషగిరినగర్కు చేరుకున్న ప్రభుత్వ విప్ రేగాకు మహిళలు, నాయకులు డప్పు వాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, ఇప్పటికే దేశంలో మార్పు మొదలైందన్నారు. గ్రామాలు, పట్టణాలు తేడాలేకుండా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. దేశ ప్రజల ఆకాంక్షతోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఉద్భవించిందని, నేడు దేశమంతటా అభివృద్ధి జరగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో చూసినా తెలంగాణ అభివృద్ధి గురించే చర్చించుకుంటున్నారని, ఇక్కడి సంక్షేమ పథకాలను కోరుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు, వివిధ పార్టీల నేతలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ గూటికి వస్తున్నారని, పార్టీ కార్యకర్త, నాయకులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రేగా స్పష్టం చేశారు. దళితులకు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని దళితబంధును కేసీఆర్ అమలుచేసి దళితబాంధవునిగా మారారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, బీఆర్ఎస్ మండల, పట్టణ కార్యదర్శులు రామిడి రామిరెడ్డి, బొలిశెట్టి నవీన్, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ఎంపీపీ కారం విజయకుమారి, సీనియర్ నాయకులు వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, యాదగిరి గౌడ్, పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రేగా అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.