ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 30: టెన్త్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరాశాజనక ఫలితాలను సాధించింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కీలకమైన మంత్రులున్నా జిల్యా విద్యాశాఖపైనా, టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంపుదలపైనా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. ఆ ప్రభావం తాజా టెన్త్ ఫలితాల్లో స్పష్టంగా కన్పించింది. ఎస్ఎస్సీ బోర్డు బుధవారం విడుదల చేసిన పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తే ఖమ్మం జిల్లా 21వ స్థానంలో, భద్రాద్రి జిల్లా 27వ స్థానంలో నిలిచాయి.
గతంలో రాష్ట్రంలోకెల్లా అన్ని జిల్లాలకంటే ఖమ్మం జిల్లా అత్యుత్తమ ఉత్తీర్ణతను సాధించేది. హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లానే ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఒక్క దఫా మినహా ఎక్కువసార్లు రాష్ట్రస్థాయిలో 15వ స్థానంలోపే నిలిచింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లా విద్యాశాఖపై పట్టింపులేని చర్యల వల్ల మెరుగైన స్థానాలు కోల్పోతూ వస్తోంది. నిరుటి ఫలితాలు, తాజా ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ రెండేళ్లలోనూ రాష్ట్రస్థాయిలో ఖమ్మం జిల్లా వరుసగా 21వ స్థానంలోనే నిలిచింది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 16,391 మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 8,408 మంది, బాలికలు 7,983 మంది పరీక్షలు రాశారు. బాలురు 7,858 మంది పాసై 93.46 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. బాలికలు 7,627 మంది పాసై 95.54 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. మొత్తంగా 15,485 మంది విద్యార్థులు పాసై 94.47 శాతం ఉత్తీర్ణతను సాధించారు. అయితే, రాష్ట్ర సగటు 92.78 ఉత్తీర్ణతతో పోలిస్తే జిల్లా ఉత్తీర్ణత 1.7 శాతం అధికంగా ఉంది. అన్ని పరీక్షల్లాగే టెన్త్‌లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురపై రెండు శాతం ఎక్కువ ఉత్తీర్ణతతో రాణించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్ఎస్సీ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ప్రతిభకనబర్చారు. మొత్తం 1,351 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1,314 మంది పాసై 97.26 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. దానవాయిగూడెం ఎంజేపీబీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని టీ.దుర్గాభవానీ 593 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 22 బీసీ గురుకుల పాఠశాలల్లో 10 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థులను రాష్ట్ర సెక్రటరీ బీ.సైదులు, ప్రాంతీయ సమన్వయాధికారి సీహెచ్.రాంబాబు అభినందించారు.
ఖమ్మంలోని సోషల్ వెల్ఫేర్‌కు చెందిన 12 గురుకులాల నుంచి 923 మంది విద్యార్థులకుగాను 900 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు. 23 మంది గైర్హాజరయ్యారు. ఎర్రుపాలెం గురుకుల విద్యార్థిని అత్యధికంగా రిషిత 566 మార్కులు సాధించినట్లు జోనల్ ఆఫీసర్ స్వరూపరాణి తెలిపారు.
టెన్త్ ఫలితాల్లో ఈసారి గ్రేడులతోపాటు మార్కులను కూడా ప్రకటించారు. ఇంటర్నల్స్‌కు 20 మార్కులుపోగా 80 మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఫలితాల విడుదలలో ఇంటర్నల్, వార్షిక పరీక్షల మార్కులు, గ్రేడింగ్‌లను పొందుపరిచారు.
కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఏప్రిల్ 30: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భద్రాద్రి జిల్లా విద్యార్థులు 91.49 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోకెల్లా భద్రాద్రి జిల్లా 27వ స్థానంలో నిలిచింది. అయితే, నిరుడు 90.39 శాతంగా ఉన్న ఉత్తీర్ణత.. ఈ ఏడాది 1.10 శాతం పెరిగి 91.49గా నమోదైంది. భద్రాద్రి జిల్లా నుంచి 5,971 మంది బాలురు, 6279 మంది బాలికలు కలిపి మొత్తం 12,250 మంది పరీక్షలు రాశారు. వీరిలో 5,320 మంది బాలురు, 5,888 మంది బాలికలు కలిపి 11,208 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 89.10 శాతం, బాలికలు 93.77 శాతం ఉత్తీర్ణత సాధించారు.