భద్రాచలం, సెప్టెంబర్ 28 : ‘మహాలక్షి’ పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. అవకాశమున్న ప్రతిచోటా ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ పండుగనూ తనకు ఆదాయ వనరుగా మలుచుకొని ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతోంది. సాధారణ చార్జీలకు అదనంగా మరో 50 శాతం వసూలు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతోంది. తాజాగా దసరా పండుగకూ అదే విధానాన్ని అనుసరిస్తోంది.
పండుగలొస్తే చాలు ఆర్టీసీ ద్వారా ‘ప్రత్యేక బస్సుల’ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపుతోంది. భద్రాచలం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే రద్దీ మార్గాల్లో స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని చెబుతూనే వాటిల్లో 50 శాతం అదనపు చార్జీలతో మోత మోగిస్తోంది. రెండు రోజుల క్రితమే మొదలైన ప్రత్యేక దోపిడీ వచ్చే నెల 13 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం భద్రాచలం – హైదరాబాద్ మార్గంలో అదనంగా 26 స్పెషల్ బస్సులను నడుపుతూ అదనపు బాదుడుకు తెరలేపింది.
దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఒకే మార్గంలో రెగ్యులర్ బస్సుల్లో ఒక చార్జీ, స్పెషల్ బస్సుల్లో మరో చార్జీ ఏమటని ప్రశ్నిస్తున్నారు. బతుకమ్మ కోలాహలం నడుస్తుండడంతో భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రధాన రూట్లలో స్పెషల్ బస్సులను నిడిపిస్తోంది. త్వరలో మరికొన్ని మార్గాల్లోనూ విస్తరించనుంది. భద్రాచలం నుంచి ప్రతి రోజూ సుమారు 15 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో రోజుకు సుమారు 30 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు.
సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.470, సూపర్ లగ్జరీల్లో రూ.650, డీలక్స్ బస్సుల్లో రూ.570, రాజధాని ఏసీ బస్సుల్లో రూ.800, లహరీ బస్సుల్లో సీటింగ్‌కు రూ.820, స్లీపర్‌కు రూ.1018 వసూలు చేస్తున్నారు. అయితే, పండుగ కోసమంటూ ఏర్పాటుచేసిన స్పెషల్ బస్సుల్లో సాధరాణ చార్జీలకు అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తోంది. రద్దీ దృష్టా బస్సులను పెంచడం బాగానే ఉన్నప్పటికీ 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేయడం పట్ల ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ కోసం పట్టణాల నుంచి ఇళ్లకు వచ్చేవారికి, ఇళ్ల నుంచి తిరిగి పట్టణాలకు వెళ్లే వారికి ఈ అదనపు చార్జీలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
భద్రాచలం – హైదరాబాద్ మార్గంలో నడిచే ప్రైవేటు బస్సుల్లోనూ భారీ దోపిడీనే జరుగుతోంది. సాధారణ రోజుల్లో నాన్ ఏసీ బస్సుల్లో సీటింగ్‌కు రూ.450, స్లీపర్‌కు రూ.650, ఏసీ సర్వీసులకు రూ.819 వసూలు చేస్తున్నారు. పండుగ సందర్భంగా టికెట్ ధర అమాంతం పెంచారు. నాన్ ఏసీ బస్సుల్లో స్లీపర్‌కు రూ.1400, సీటింగ్‌కు రూ.1000, ఏసీ బస్సుల్లో సీటింగ్‌కు రూ.1400కు పైగా వసూలు చేస్తున్నారు. అయినా, అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన సందర్భాలు లేనేలేవు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామంటూ గొప్పలు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పండుగల వేళ ప్రయాణికుల ముక్కు పిండుతోంది. మహిళా ప్రయాణికుల కోసం నడిపిస్తున్న బస్సుల సంఖ్య తగ్గించి అవే బస్సులను ప్రత్యేక బస్సుల పేరిట నడిపిస్తోంది. వాటిల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. చార్జీల దోపిడీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తరఫున ఆర్టీసీ అధికారులను కలుస్తాం.
-ఆకోజు సునీల్, బీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్