టేకులపల్లి, ఆగస్టు 22: లారీలో ఒడిశా నుంచి రాజస్థాన్‌కు అక్రమంగా తరలిస్తున్న 424 కిలోల గంజాయిని సీసీఎస్, టేకులపల్లి పోలీసులు గురువారం సాయంత్రం సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను తెలిపారు. టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ పరిధి వెంకట్యాంతండా సమీపంలో సీసీఎస్, టేకులపల్లి పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా అనుమానాస్పదంగా వచ్చిన లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో 424.950 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని, గంజాయి కొనుగోలు చేసిన నిందితులు ఒడిశా నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా రాజస్థాన్ తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
మొత్తం నలుగురు నిందితుల్లో ప్రభులాల్ గుర్జర్, శివరాజ్ గుర్జర్ పట్టుబడగా.. రాంబాబు, నారాయణ గుర్జర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. గంజాయి తరలిస్తున్న లారీని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్, టేకులపల్లి పోలీసులను డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు ఆలకుంట రాజేందర్, శ్రీకాంత్, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్సై ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.