బీసీ కోటా అంశంలో కాంగ్రెస్ సర్కారు మోసాన్ని గుర్తించిన బహుజనులు భగ్గుమన్నారు. రిజర్వేషన్ల శాతాన్ని తగ్గిస్తే రేవంత్ ప్రభుత్వ భరతం పడతామంటూ హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ రిజర్వేషన్లను పెంచుతామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42 శాతానికి పెంచుతామని ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట పచ్చిమోసానికి పాల్పడిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లను పెంచుతామంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఇటీవల హడావిడిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడంపై బహుజనులు మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమంటూ ఇటీవల చేపట్టిన కులగణన సర్వేను సమగ్రంగా నిర్వహించకపోవడం, సర్వే నివేదిక సమస్తం తప్పులతడకగా ఉండడం, అందులోనూ బీసీ జనాభా గణనీయంగా తగ్గిందని చెప్పడం, పైగా ఓసీ జనాభా అమాంతంగా పెరిగిందని చూపించడం వంటి చర్యలపై బహుజనులు, బీసీ సంఘాల నాయకులు భగ్గుమని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లును కేంద్రం ఆమోదించాలంటూ మెలిక పెడితే తాము కూడా కాంగ్రెస్‌కు వాత పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు ద్రోహం తలపెట్టిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పి తీరుతామంటూ స్పష్టం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు చేసిన మోసం గురించి బీసీ వర్గాల ప్రజలు, బహుజన సంఘాల నాయకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించింది. రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ ఇదే శాతంతో రిజర్వేషన్లు అమలు చేయాలి. పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకునేందుకు బీసీ రిజర్వేషన్లను తగ్గించారు. గతంతో పోలిస్తే సుమారు 25 లక్షల మంది బీసీలను సర్వేలో చూపించకపోవడమంటే కుట్ర చేయడమే.
2014 నాటి సమగ్ర కుటుంబ సర్వేలో 56 శాతంగా ఉన్న బీసీలు 2024 సర్వేలో 46 శాతానికి ఎలా తగ్గారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు తగ్గారని, ఓసీలు పెరిగారని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మేలా లేవు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే నమ్మకం లేదు. అందుకే ఈ సర్వే నివేదికలను సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, నాయకులే తగులబెడుతున్నారు. రిజర్వేషన్ల పేరిట తాజాగా పెట్టిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కూడా బీసీలను మభ్యపెట్టేందుకేనని అర్థమవుతూనే ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుడు తడకలుగా ఉంది. ఇటీవలి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రిజర్వేషన్లు పెంచితే బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను అప్పట్లో రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. తెలివున్న వాళ్లెవరూ సర్వేలో పాల్గొనబోరంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అదే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు కులగణన చేపట్టి బీసీలు 46 శాతం మందే ఉన్నారంటూ చెబుతున్నారు.
రాష్ట్రంలో ఓసీ జనాభా శాతం ఒక్కసారిగా గణనీయంగా పెరగడమేంటనేది అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఉన్నపళంగా ఎలా తగ్గుతుంది? అంటే ఇటీవల చేపట్టిన కులగణన సర్వే తప్పులతడకగా ఉన్నట్లే కదా? లోపభూయిష్టమైన సర్వే చేసి బీసీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదం కావాలని చెప్పడమంటే బీసీలను కచ్చితంగా మోసం చేయడమే అవుతుంది.
బీసీల రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వే సమగ్రంగా జరగలేదని స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో అధిక శాతంగా ఉన్న బీసీలు ఇప్పుడు అత్యధికంగా తగ్గినట్లు ఈ సర్వే చెబుతుండడమే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. ఇటీవలి అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం చెప్పినవి.. సర్వే గణాంకాల మాదిరిగా లేవు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కల మాదిరిగా ఉన్నాయి. బీసీల సంఖ్య పెరగడం కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం లేనట్లుగా ఉంది. అందుకే జనాభా శాతాన్ని తక్కువగా చూపి బీసీలకు అన్యాయం చేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కచ్చితంగా బీసీల వ్యతిరేకి. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తెలంగాణలోని బీసీలందరినీ మరోసారి మోసం చేశారు. కులగణన పేరుతో బీసీల జనాభాను లెక్కిస్తామని చెప్పారు. కానీ పూర్తిస్థాయిలో సర్వే చేయకుండానే బీసీలు తగ్గారని చెబుతున్నారు. సాక్షాత్తూ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే ఈ సర్వేను ఆక్షేపించారు. దానిని చిత్తు కాగితంలా అభివర్ణించి కాల్చివేసి నిరసన తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చెబుతున్న ఈ మాటలు ఏపాటికి నిజమైనవో ఈ ఘటనల ద్వారా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాలను మోసం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కన్పిస్తోంది. తాజా కులగణనతో తీసుకొచ్చే రిజర్వేషన్లు బీసీ కులాలకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. కులగణన సమగ్రంగా చేపట్టలేదు. సర్వే నివేదిక మొత్తం తప్పులతడకగా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ఎంతో వ్యత్యాసం ఉంది. తాజా సర్వేలో బీసీలు ఇంత పెద్ద సంఖ్యలో తగ్గడమేంటనేది అనుమానాలకు తావిస్తోంది. సుమారు 40 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే చెబుతున్నారు. మరి ఏ లెక్కన రిజర్వేషన్లపై తీర్మానం చేశారు?