భద్రాచలం, ఫిబ్రవరి 4: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం, సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న చిత్రకూట మండపంలో శ్రీభక్త రామదాసు జయంతి ఉత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. శ్రీచక్ర సిమెంట్ అధినేతల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం భక్త రామదాసు చిత్రపటాన్ని అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి హారతి సమర్పించిన తరువాత ప్రముఖ వాగ్గేయకారులైన త్యాగయ్య, పురందర దాసు, తూము నర్సింహదాసు, అన్నమయ్య చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. సమస్త మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్త రామదాసు చిత్రపటంతో ఊరేగింపుగా గోదావరి నది వద్దకు తీసుకొని వెళ్లి గోదావరి మాతకు పూజలు చేశారు. అనంతరం తీర్థపు బిందెతో విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న తూము నర్సింహాదాసు విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియం వద్ద ఉన్న భక్త రామదాసు విగ్రమానికి పూలమాలలు వేశారు. తరువాత ఆలయ గోపురం వద్ద ఉన్న భక్త రామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం జరిపి, పట్టు వస్ర్తాలు అలంకరించారు. సరిగ్గా 9.05గంటలకు భక్త రామదాసు చిత్రపటాన్ని చిత్రకూట మండపానికి తీసుకొని వచ్చి పూజలు నిర్వహించారు. భక్త రామదాసు రామయ్యకు తయారు చేయించిన దివ్యాభరణాలను స్వామివారి ఉత్సవ విగ్రహానికి అందంగా అలంకరించి, ప్రత్యేక పల్లకిలో చిత్రకూట మండపానికి తీసుకెళ్లి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేంచేయింపు చేశారు. చిత్రకూట మండపంలో ప్రముఖ వాగ్గేయకారులు ఆలపించిన కీర్తనతో ఆహుతులు పులకించిపోయారు.