మామిళ్లగూడెం, ఆగస్టు 1: ఖమ్మం జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం.. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు, గుత్తేదారులకు శాపంగా మారింది. ఆ అధికారుల పొరపాటుతో.. ఆ పనులు చేసిన వారికి సుమారు రూ.1.90 కోట్ల బిల్లులు రద్దయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పొరపాటును గ్రహించిన అధికారులు ఆ తరువాత దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ.. పునఃపరిశీలన, బిల్లుల చెల్లింపు అంశాలు రాష్ట్రస్థాయిలో ఉండడంతో అవి ఎంత వరకూ సఫలీకృతమవుతాయనే విషయం సందేహంగా మారింది.
నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో అప్పులు చేసి మరీ వేగంగా పనులు చేపట్టామని.. ఆ పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు చెబుతున్నారు. కానీ, అధికారుల తప్పిదంతో తాము చేసిన పనుల బిల్లులు రద్దుకావడంతో ఏళ్లతరబడి వడ్డీలు పెరిగి తాము అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి పొరపాటుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) కింద రూ.1.90 కోట్లు మంజూరయ్యాయి. వాటి కింద జిల్లాలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టాలని అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో వాటితో అప్పటి సర్పంచ్‌లు, గుత్తేదారులు కలిసి 30 నిర్మాణాలను పూర్తిచేశారు. వాటిని దగ్గరుండి మరీ పర్యవేక్షించిన పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు.. వాటికి మెజర్మెంట్ బుక్స్(ఎంబీ) రికార్డు చేశారు. వాటికి చెల్లింపులు జరపాలంటూ జిల్లా ప్రణాళికా విభాగం శాఖ ద్వారా అప్పటి ప్రభుత్వానికి బిల్లులు పంపారు. ప్రభుత్వం నిధులై.. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులు, గుత్తేదారుల ఖాతాల్లో జమ కావాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది.
2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ‘గతంలో మంజూరైన పనుల్లో పూర్తయినవి, పూర్తికానివి గుర్తించి నివేదిక పంపాలి’ అంటూ పీఆర్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించింది. దీంతో ‘ఆ పనులు ఇంకా మొదలు పెట్టలేదు’ అంటూ నివేదిక పంపారు. దీంతో ఆ పనులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, అప్పటికే ఆ పనులన్నీ పూర్తయి బిల్లుల చెల్లింపు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ విషయం గత కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ పనుల విషయంలో వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ముదిగొండ మండలం మాధాపురంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించిన బిల్లు చెల్లించాలంటూ ఆ పనులు చేసిన గుత్తేదారు మధుసూదన్‌రావు కొద్దిరోజుల క్రితం అధికారులను ఆశ్రయించారు. ఆ పని రద్దయిందంటూ ప్రస్తుత అధికారులు చెప్పడంతో ఆయన ఖంగుతున్నాడు. ఇదే విషయంపై గత మార్చిలో కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్‌కు అర్జీ అందించాడు. కలెక్టర్ దానిని ప్రణాళికా శాఖకు పంపగా.. అక్కడి నుంచి తిరిగి ఖమ్మం పీఆర్ డివిజన్ కార్యాలయానికి చేరింది. అయితే, తాము కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా బిల్లులు రావడం లేదని, అధికారుల తప్పిదం కారణంగా తాము అప్పులపాలయ్యామని ఆ పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం పీఆర్ డివిజన్లో చేపట్టిన 30 పనులకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. పనులు ప్రారంభం కాలేదంటూ నాటి అధికారులు పొరపాటున నివేదిక పంపారు. దీంతో పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. వాటిని సరిచేసి కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికను పంపాం. రాష్ట్ర అధికారులు మరోసారి ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తాం.
-జీ.వెంకటరెడ్డి, పీఆర్ ఖమ్మం జిల్లా ఎస్ఈ