భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : గాలిదుమారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను అతలాకుతలం చేసింది. రెండు గంటలపాటు బీభత్సం సృష్టించి దాదాపు రూ.కోటి మేర నష్టాన్ని మిగిల్చింది. ఇళ్లపై రేకులు, పైకప్పులను కుప్ప చేసి మొండి గోడలను మిగిల్చింది. విద్యుత్ స్తంభాలు, టాన్స్‌ఫార్మర్లు, భారీ హోర్డింగ్‌లను నేలమట్టం చేసింది. కోతకొచ్చిన వరి పంటను, మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటల్లోని కాయలను నేలపాలు చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో వీచిన ఈదురు గాలులు, వర్షానికి స్తంభాలు నేలకూలడంతో ఆదివారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు దోమల మోత, ఉక్కపోతతో రాత్రంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. సోమవారం కూడా ప్రధాన పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం రాత్రి నుంచి మరమ్మతులతోపాటు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినా తెల్లవారుజాము వరకు ఒక ఫీడర్‌కు కరెంటు ఇవ్వగలిగారు. పనులు పూర్తికాని ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలోనే మగ్గిపోయారు.
ఒక వైపు ఈదురు గాలులు.. మరో వైపు అకాల వర్షానికి రైతులు మళ్లీ పంటలు నష్టపోవాల్సి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 9 మండలాల్లోని 21 గ్రామాల్లో 285 మంది రైతులకు చెందిన 676 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. యాసంగిలో సాగు చేసిన పంటలకు మొన్నటి వరకు సాగునీరు అందకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం అకాల వర్షానికి ఎంతో కొంత చేతికొచ్చిన పంటలను కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికే వ్యవసాయ శాఖ అంచనాలను సిద్ధం చేసింది.
గాలివాన బీభత్సానికి విద్యుత్ శాఖకు రూ.68 లక్షల మేర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 278 విద్యుత్ స్తంభాలు ఇళ్లు, రోడ్లపై పడిపోయాయంటే గాలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక 48 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నేలమట్టం కావడంతో ఆ శాఖ అధికారులు ఆగమేఘాలపై పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ వివరాలను విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్ వెల్లడించారు.
మరోవైపు ఏళ్లనాటి భారీ వృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు కూలిపోవడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గాలిదుమారం తీవ్రతపై కలెక్టర్ ప్రియాంక ఆల వెంటనే జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. రోడ్డుపై అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. గాలికి విరిగిపడిన చెట్లు, వ్యర్థాలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 22: ఈ నెల 21న కురిసిన అకాల వర్షం, రాళ్లవానకు ఖమ్మం జిల్లాలోని కేవలం సింగరేణి మండలంలో 102 మంది రైతులకు సంబంధించి 185.20 ఎకరాల్లో మాత్రమే పంటల నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ నుంచి సోమవారం ఒక ప్రటన విడుదల చేశారు.
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం సింగరేణి మండలంలో 102 మంది రైతులకు సంబంధించి 185.20 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో 35 మంది రైతులకు సంబంధించిన 48 ఎకరాల్లో వరి, 60 మంది రైతులకు సంబంధించిన 83.20 ఎకరాల్లో మొక్కజొన్న, ఏడుగురు రైతులకు సంబంధించిన 54 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. సింగరేణి మండలంలో కూడా 8 గ్రామాల్లోని పంటలకు మాత్రమే నష్టం జరిగినట్లు అధికారులు ఆ నివేదికలో పొందుర్చారు.