శాసనసభ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క బుధవారం తేలింది. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. పత్రాల్లో వివరాలు సరిగా లేకపోవడం తదితర కారణాలతో ఈ నెల 13న ఎన్నికల అధికారులు స్క్రూట్నీలో కొన్ని నామినేషన్లను తిరస్కరించారు. ఉపసంహరణ గడువు బుధవారం ఉండడంతో 39 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఖమ్మం జిల్లాలో 134 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. పాలేరు, ఇల్లెందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను ఆ పార్టీ నేతలు బుజ్జగించినా ససేమిరా అంటూ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా.. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభలు సక్సెస్ కావడంతో జోష్ మీదున్న బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఖమ్మం, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. బరిలో నిలిచేదెవరో..? వైదొలిగేదెవరో? తేలింది.. గిరి గీసి బరిలో దిగే అభ్యర్థుల లెక్క తేలింది.. ఇక సై.. అంటే సై.. అంటూ ప్రచారంలో దూసుకుపోవడమే మిగిలి ఉన్నది. బుధవారం ఉమ్మడి జిల్లాల పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. రెండు జిల్లాల నుంచి 267 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో 39 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 134 మంది, భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 95 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తేల్చారు.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 120 మంది నామినేషన్లు సక్రమంగా ఉండగా వీరిలో 26 మంది, ఖమ్మం జిల్లావ్యాప్తంగా 147మంది నామినేషన్లు సక్రమంగా ఉండగా 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ వేసే నాటికి కాంగ్రెస్ పార్టీలో ఉండి తదనంతరం బీఆర్ఎస్లోకి చేరిన కామేపల్లి జడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్, మరోనేత రాంచంద్రునాయక్, అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి బీఆర్ఎస్లో చేరిన ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చీమల వెంకటేశ్వర్లు మాత్రం ఎన్నికల బరిలో కొనసాగుతున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి ఎన్నికల బరిలోనే ఉన్నారు. పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డికి డమ్మీ నామినేషన్ వేసిన ఆయన సతీమణి కందాళ విజయ, బీఆర్ఎస్ నేత సోలిపురం జయచంద్రారెడ్డి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే పాలేరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లిక వెంకటేశ్వర్లుకు డమ్మీగా నామినేషన్ వేసిన వెంకటరమణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో అత్యధికంగా పాలేరు నియోజకవర్గం నుంచి 39 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి 36 మంది, కొత్తగూడెం నుంచి 30 మంది బరిలో ఉంటున్నారు. సత్తుపల్లి నుంచి 26 మంది, మధిర నుంచి 20మంది రంగంలో ఉన్నారు. ఇల్లెందు నుంచి 20 మంది, పినపాక నుంచి 18 మంది, అశ్వారావుపేట నుంచి 14 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా వైరా, భద్రాచలం నుంచి 13 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తి కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇక ఎన్నికల ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలు అనేక మంది రెబల్స్‌గా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు వారి బుజ్జగించే పనిలో ఉన్నారు. కొన్నిచోట్ల వారి పావులు పనిచేయగా, మరికొన్ని చోట్ల పాచిక పారలేదు. ముఖ్యంగా పాలేరు, ఇల్లెందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది.