మంగళవారం 02 మార్చి 2021
Khammam - Jan 24, 2021 , 02:30:50

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత..

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత..

  • ప్రజల భాగస్వామ్యంతోనే ‘రోడ్డు భద్రత’ సాధ్యం
  • అవగాహన కోసం సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించాలి
  • ఆటోబేల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాల గుర్తింపు 
  • రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 
  • హెల్మెట్‌ ధారణ అవగాహన ర్యాలీలో పాల్గొన్న అజయ్‌, కలెక్టర్‌, సీపీ

రఘునాథపాలెం, జనవరి 23: రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్‌ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు జిల్లా రవాణాశాఖ నగరంలో శనివారం బైక్‌ ర్యాలీని చేపట్టింది. పెవిలియన్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ ర్యాలీలో మంత్రి అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. డీటీవో కిషన్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రవాణాశాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడారు. మన దేశంలో రోగాల కారణంగా మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాల భారిన పడి చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉందని అన్నారు. ఏటా చేపట్టే రోడ్డు భద్రతా వారోత్సవాలకు బదులుగా ఈ ఏడాది మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 

హైదరాబాద్‌ తరువాతి స్థానం ఖమ్మానిదే..

రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలను చూసుకుంటే హైదరాబాద్‌ తరువాతి స్థానం ఖమ్మానిదేనని, నగరంలో రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి విశాలమైన రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. పోలీసు, రవాణాశాఖల అధికారులు మూడు నెలలకోసారి రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వేగనియంత్రిక సూచికలను ఏర్పాటు చేయాలని, బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్థలాన్ని గుర్తించి ఆటోబేల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ ‘సడక్‌ సురక్షా-జీవన్‌ రక్షా’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ హెల్మెట్‌ లేకపోవడం వల్లే 92 శాతం మంది ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను కోల్పోతున్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మేయర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళి, మచ్చా నరేందర్‌, ఖమ్మం, కొత్తగూడెం డీటీవోలు టీ.కిషన్‌రావు, గోపాల్‌రెడ్డి, ఆర్టీఏ కమిటీ సభ్యుడు వల్లభనేని రామారావు, ఎంవీఐలు శంకర్‌నాయక్‌, జైపాల్‌రెడ్డి, ఏ.వరప్రసాద్‌, కిశోర్‌బాబు, మనోహర్‌, వెంకటరమణ, ప్రమీల, ఆర్టీఏ కానిస్టేబుళ్లు తలారి రమేశ్‌, నిశ్చల, సరిత, క్రాంతి పాల్గొన్నారు.

VIDEOS

logo