ఖమ్మం, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, సాగునీటిరంగం, పారిశ్రామిక అభివృద్ధి, అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం వంటి ప్రాధాన్యత రంగాల్లో ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిషరించారు.
అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన విరోచిత పోరాటాల ఫలితంగా మన ప్రాంతం రాజుల పాలన నుంచి ప్రజాస్వామ్య భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనంకావడం జరిగిందని, దీనిని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశామని, జిల్లాలోని 1,15,180 మందికి 766 కోట్ల 66 లక్షల పైగా రుణమాఫీ చేశామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
ఎన్నడూ లేనివిధంగా కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఖమ్మంలో మున్నేరు వాగు 40 అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహించి వరదలతో ముంచెత్తిందని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతూ సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేయడంలో జిల్లా యంత్రాం గం, అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న 15 వేల 96 కుటుంబాలకు 16 వేల 500 రూపాయల చొప్పున పంపిణీ చేశామని, పంటనష్టం జరిగిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయల పరిహారం, ఆస్తి, పశునష్టం జరిగిన వాటికి పరిహారాన్ని అందజేస్తామని తెలిపారు.
జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. జిల్లా పౌర సరఫరాలశాఖ, వ్యవసాయ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఎన్పీడీసీఎల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, డి.మధుసూదన్‌నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.