బూర్గంపహాడ్/ ఇల్లెందు రూరల్/ రఘునాథపాలెం, ఆగస్టు 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలంలో 155 కిలోలను, ఇల్లెందులో 53 కిలోలలను, ఖమ్మంలో 450 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం ఘటనలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య కథనం ప్రకారం…భద్రాచలం బ్రిడ్జి సమీపంలో ఎక్సైజ్ సీఐ రహీమున్నీసా తన సిబ్బందితో ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద ఆదివారం తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆంధ్రా నుంచి పాల్వంచ వైపు ఓ ట్రాక్టర్ (ఆర్బీటీ23113) వెళ్తోంది. ఈ ట్రాక్టర్లో గంజాయితో వస్తున్న స్మగ్లర్లు ఎక్సైజ్ పోలీసులను చూసి ట్రాక్టర్‌ను అక్కడే నిలిపివేసి పరారయ్యారు. సీఐ తన సిబ్బందితో ట్రాక్టర్‌ను తనిఖీ చేయగా అందులో 155 కిలోల ఎండుగంజాయి లభ్యమైంది. ట్రాక్టర్‌తో పాటు గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పట్టుబడిన ఎండు గంజాయి విలువ రూ.39 లక్షలు ఉంటుంది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్, సీఐ రహీమున్నీసా, ఎస్సై అల్లూరిసీతారామరాజా, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
వాహన తనిఖీల్లో భాగంగా ఇల్లెందులో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇల్లెందు పోలీసు స్టేషన్లో డీఎస్పీ చంద్రభాను ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని డిగ్రీ కాలేజీ సమీపంలో శనివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం వైపు నుంచి ఓ కారు వస్తోంది. దానిని ఆపగా అందులో ఉన్న వ్యక్తి కారు డోర్ తీసుకొని పారిపోయాడు. కారును తనిఖీ చేయగా రూ.13 లక్షల విలువైన 53 కేజీల గంజాయి లభ్యమైంది.
దీంతో అదే కారులో ఉన్న మిగతా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఆ గంజాయిని మల్కాన్‌గిరి నుంచి ఉత్తరాకాండ్కు తీసుకెళ్తున్నారు. వారు తరలిస్తున్న గంజాయిని, కారును, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లలిత్ మోహన్, ప్రేమ్ వీర్ సింగ్, రాజ్‌కుమార్, అమృత్పాల్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు రిమాండ్ చేయనున్నారు. సీఐ బత్తుల ప్రవీణ్‌కుమార్, ఎస్సై సూర్యం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మద్యానికి బానిసై గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ భానుప్రకాశ్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం కైకొండాయిగూడేనికి చెందిన గద్దల రాకేశ్, రాజీవ్‌నగర్ గుట్టకు చెందిన చల్లా గోపి, యూపీహెచ్ కాలనీకి చెందిన పులి ధనుష్‌లు మద్యానికి అలవాటు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని డొంకరాయి, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై అందిన సమాచారం మేరకు సీపీ సునీల్‌దత్ ఆదేశాలతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఖానాపురం హవేలీ ఎస్సై అలీం హుస్సేన్ తన సిబ్బందితో కైకొండాయిగూడెంలోని ఓ ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. దాడి సమయంలో 430 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు. మూడు సెల్ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ చేశారు.