e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home ఖమ్మం పూల సింగిడి

పూల సింగిడి

  • బతుకమ్మా.. వెళ్లి రావమ్మా!
  • అట్టహాసంగా ‘సద్దుల’ సంబురం
  • పూల వనాలైన వీధులు..
  • జనసంద్రమైన బతుకమ్మ ఘాట్లు
  • పూల వనమైన ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
  • అర్ధరాత్రి వరకు కొనసాగిన సంబురాలు
  • నిమజ్జనం చేసి ఘన వీడ్కోలు పలికిన మహిళలు
  • వేడుకల్లో పాల్గొన్న అధికారులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

కొత్తగూడెం కల్చరల్‌, అక్టోబర్‌ 14: తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరింది. ఆడబిడ్డలు బతుకమ్మ వద్ద ఆడి పాడి గౌరమ్మకు వీడ్కోలు పలికారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. కొత్తగూడెం జిల్లాలోని మొర్రేడువాగు, గోధుమవాగు, వాగులు, చెరువుల వద్ద బతుకమ్మ నిమజ్జన వేడుకలు జరిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలో ఏర్పాట్లను కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు పర్యవేక్షించారు. సిబ్బందితో కలిసి బందోబస్తునిర్వహించారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీలు భూక్యా సోనా, బాదావత్‌ శాంతి, విజయలక్ష్మి, నాయకులు వనమా రాఘవేందర్‌రావు, రజాక్‌, తొగరు రాజశేఖర్‌, రుక్మాంగధర్‌ బండారి, అన్వర్‌పాషా, జక్కుల సుందర్‌రావు వీక్షించారు.

పుడమి పూల సింగిడి పరుచుకున్నది. రంగురంగుల పుష్పాలతో రహదారులన్నీ పూల వనాలయ్యాయి. తొమ్మిది రోజులపాటు బతుకమ్మలో ఒదిగిన తీరొక్క పూలు పరవశించాయి. తంగేడు తళతళలు.. గునుగుల గుభాళింపులు, చామంతుల చరిష్మాలు.. మందారాల మురిపాలు, సీతజడల సిగ్గులు వెరసి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పూదోటగా విరబూశాయి. సప్తవర్ణాల చీరె కట్టినట్లుగా శోభాయమానమయ్యాయి. విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించాయి. సంప్రదాయ వస్త్రధారణతో మహిళలు, యువతులు, చిన్నాపెద్దా అందరూ దండులా కదిలి వచ్చి పూల జాతరను ఆసక్తిగా తిలకించారు. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఆడపడుచులు బతుకమ్మలను అందంగా అలంకరించి చుట్టూ వలయాకారంగా చేరి చప్పట్లు కొడుతూ.. పాటలు పాడుతూ సందడి చేశారు. కోలాట నృత్యాలతో అలరించారు. ‘పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా..! అంటూ ఘనంగా నిమజ్జనం చేశారు.

- Advertisement -

జిల్లా కేంద్రంలో సద్దుల సంబురం కనులవిందు చేసింది. ఆడపడుచుల బతుకమ్మ పాటలతో సందడి హోరెత్తింది.. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న బతుకమ్మకు గురువారం మహిళలు సద్దులు కట్టి నిమజ్జనం చేశారు. జిల్లాకేంద్రంలోని మొర్రేడు వాగు, గోధుమ వాగు, ధన్‌బాద్‌ చెరవు బతుకమ్మ ఘాట్లు జనసంద్రమయ్యాయి. వేడుకలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్‌చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

తంగేడు.. కలువలు.. నంది వర్థనాలు.. గులాబీలు.. మందారాలు.. చామంతులు.. ముద్ద బంతులు బతుకమ్మలో ఒదిగి పుడమిపై హరివిల్లులయ్యాయి.. గౌరమ్మకు జే జేలు పలికాయి.. బొడ్డెమ్మలు కొలువుదీరగా పట్టణాలు, పల్లెలు పూల వనాలయ్యాయి.. గ్రామ నడిబొడ్డున ఆడబిడ్డలు ‘గౌరమ్మా వెళ్లి రావమ్మా.. మళ్లొచ్చే ఏడు సౌభాగ్యాలు తేవమ్మా..’ అని పదం పాడుతూ.. పాదం కదుపుతుండగా.. డప్పు చప్పుళ్లు.. కోలాట విన్యాసాలు.. నృత్యకారుల నృత్యాలు.. యువతీ యువకుల కేరింతల నడుమ గౌరమ్మ గంగమ్మ ఒడికి చేరింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా గురువారం జరిగిన ‘సద్దుల బతుకమ్మ వేడుక’ అంబరాన్నంటింది.. ఆకేరు, మున్నేరు, గోదావరి, పాలేరు జలాశయాలు, చెరువుల వద్ద బతుకమ్మ ఘాట్లు జన సంద్రమయ్యాయి.

భద్రాచలం, అక్టోబర్‌ 14: సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం జిల్లావ్యాప్తంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలకంరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేసి, ‘వెళ్లిరా గౌరమ్మా..’ అంటూ సాగనంపారు. భద్రాచలంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు దంపతులు, తెలంగాణ జాగృతి బాధ్యులు, నాయకులు కలిసి పార్టీ కార్యాలయం నుంచి బతుకమ్మలను ఊరేగింపుగా మిథిలా స్టేడియం ప్రాంగణానికి తీసుకెళ్లారు. వేడుకల అనంతరం గోదావరిలో నిమజ్జనం చేశారు.
పినపాక: మండలంలోని సీతంపేట గ్రామంలో వేడుకల్లో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆడిపాడారు.

అశ్వారావుపేట రూరల్‌/అన్నపురెడ్డిపల్లి/ ములకలపల్లి/దమ్మపేట/ఇల్లెందు/టేకులపల్లి, అక్టోబర్‌ 14: ‘చిత్తూ చిత్తూల గుమ్మ.. శివుడి ముద్దుల గుమ్మ..’ ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. మూడు జాములాయె చందమామ..’ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ మహిళలు ఆడి పాడారు. గురువారం ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో వేడుకలను మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల్లో మహిళలు బతుకమ్మలను ఉంచి ఆడి పాడారు. టేకులపల్లిలో ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌, జడ్పీ చైర్మన్‌ జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లి గౌరమ్మను నిమజ్జనం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement