శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కాగా.. బీఆర్ఎస్, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం లక్ష్మీనర్సింహస్వామి, సాయిబాబా ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. మసీదుకు వెళ్లి నమాజు చేసిన అనంతరం నామినేషన్ వేశారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కార్యకర్తల కోలాహలం నడుమ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పినపాకలో రేగా కాంతారావు నామినేషన్ వేశారు. ఉమ్మడి జిల్లా పాలేరులో కందాళ ఉపేందర్‌రెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. గురువారం సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో బానోతు హరిప్రియానాయక్, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, వైరాలో బానోతు మదన్‌లాల్, మధిరలో లింగాల కమల్‌రాజు నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 147 మంది అభ్యర్థులు 215 నామినేషన్లు వేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 136 మంది అభ్యర్థులు.. 211 నామినేషన్లు దాఖలు చేశారు.
ఖమ్మం, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం పూర్తయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. సాయంత్రం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అధికారులు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించారు. బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభి పత్రాలను స్వీకరించారు. కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. మణుగూరులో పినపాక బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు నామినేషన్ దాఖలు చేశారు. కొత్తగూడెం నుంచి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా జలగం వెంకట్రావు నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులే ఉభయ జిల్లాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 13న స్క్రూట్నీ ప్రక్రియ పూర్తవుతుంది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు 15న పత్రాలను ఉప సంహరించుకునే అవకాశం ఉన్నది. ఇదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల వారీగా ప్రకటించనున్నారు. భద్రాద్రి జిల్లా 136 మంది అభ్యర్థులు 211, ఖమ్మం నుంచి 147 మంది అభ్యర్థులు 215 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. కొన్ని నియోజకవర్గాలు మినహా చాలా చోట్ల పార్టీ ప్రకటించిన అభ్యర్థులు కాకుండారెబల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు ఏదైనా జరగొచ్చనే ఆశతో వారంతా పత్రాలు దాఖలుచేసినట్లుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా ఇల్లెందు, పినపాక, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి ఎక్కువగా రెబల్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇల్లెందు టికెట్ కోరం కనకయ్యకు కేటాయించడంతో ఈ నియోజకర్గం నుంచి పోటీ చేసే రెబల్స్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, బీజేపీ, జనసేన నుంచి కూడా ఎంతోమంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి సంఖ్యా తక్కువేమీ కాదు. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాల్లో అభ్యర్థులు నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతున్నది.