భద్రాద్రి కొత్తగూడెం, జూలై 30 (నమస్తే తెలంగాణ) : రెండోవిడత రుణమాఫీలో సైతం కాంగ్రెస్ సర్కారు రైతులకు మొండిచేయి చూపించింది. మంగళవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి రెండోవిడత ప్రక్రియను ప్రారంభించగా జిల్లాలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని రైతువేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రుణమాఫీ అయిన కొంతమందిని మాత్రమే రైతువేదికల వద్దకు పిలిచి మాఫీ అయినట్లు వారితో మాట్లాడించారు. మాఫీకాని రైతులకు మాత్రం సమాచారం ఇవ్వలేకపోయారు. జిల్లావ్యాప్తంగా రూ.1.50 లక్షల లోపు రుణాలు తీసుకున్న 16,377 మంది రైతులకు రెండోవిడతలో భాగంగా రూ.137 కోట్ల నిధులు విడుదలైనట్లు అధికారులు ప్రకటించారు.
తొలివిడతతో వేలమంది అర్హులు ఉండగా కేవలం 28,018 మందికే రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మొదటివిడతలో జిల్లా సహకార సంఘాల పరిధిలో 42,849 మంది రైతులు అర్హులు ఉండగా కేవలం 10,674 మందికి రుణమాఫీ చేశారు. ఇది కేవలం సొసైటీల లెక్కమాత్రమే. బ్యాంకుల పరిధిలో ఇంకా ఎక్కువ మంది రుణాలు మాఫీకాని రైతులు ఉన్నారు. రెండోవిడతలో 3,991 మంది అర్హులు ఉండగా ఇంకా జాబితా రాలేదని సొసైటీలకు లెక్కను ఇవ్వకపోవడం విశేషం. జిల్లావ్యాప్తంగా కేవలం సొసైటీల పరిధిలో 49,099 మంది అర్హులు ఉండగా మొదటివిడత 10,674 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. జిల్లావ్యాప్తంగా మొత్తంగా అన్ని బ్యాంకుల్లో రైతులకు కలిపి 44,395 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. అంటే ఈ లెక్కన ఇతర బ్యాంకుల్లో లెక్కలు తీస్తే ఎంతమంది రైతులు ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు.
రుణమాఫీ లెక్కలు ఇలా ఉంటే పోడు రైతుల సమస్య విచిత్రంగా ఉంది. జూలూరుపాడు మండలం చింతల్తండాకు చెందిన 35మంది రైతులకు రుణమాఫీ అయినా రుణాలు మళ్లీ ఇవ్వడంలేదని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఇలాంటి సమస్యలతో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదే గ్రామానికి చెందిన రైతు గుగులోత్ ఈర్యా జీవించి ఉండగానే చనిపోయినట్లు చూపి రైతు భరోసాతోపాటు ఇతర పథకాలు లేకుండా చేశారు. దీంతో ఆ రైతు కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మాది పోడు పట్టా. రుణమాఫీ అయ్యింది. రైతుబంధు కూడా వస్తున్నది. బ్యాంకు అధికారులు మాత్రం మళ్లీ రుణం ఇవ్వమని చెప్తున్నారు. మా ఊర్లో 35 మంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది. కొంతమందికి రుణమాఫీ రాకుండా ఇబ్బంది పడుతుంటే మా పరిస్థితి ఇలా ఉంది. అధికారులు మమ్మల్ని పట్టించుకోవాలి.
– భూక్యా రాములు, చింతల్తండా, జూలూరుపాడు మండలం
నాకు నాలుగెకరాల పొలం ఉంది. రైతుబంధు ఇస్తున్నారు. కాని పట్టా రాలేదు. చాలాసార్లు అధికారుల్ని అడిగినా పట్టించుకోవడం లేదు. నాకు పట్టా ఇప్పించండి. రుణమాఫీ ఎట్లా వస్తది. అప్పులు తెచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను. మా ఊర్లో కొంతమంది రైతులకు ఇదే పరిస్థితి ఉంది. అందుకే కలెక్టర్ సార్ను కలిసాము.
– బానోత్ నాగు, చింతల్తండా, జూలూరుపాడు మండలం