ఖమ్మం అర్బన్, మార్చి 21: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు తమ ఇష్టదైవాలకు పూజలు చేసి పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను పంపించారు. ఖమ్మం జిల్లాలో తెలుగు పరీక్ష 16,417 మందికి.. 16,391 మంది విద్యార్థులు రాశారని, 99.84 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. ప్రైవేట్‌లో 21 మందికి.. 17 మంది హాజరయ్యారు.
అడిషనల్ డైరెక్టర్, రెండు జిల్లాల అబ్జర్వర్ ఎస్.విజయలక్ష్మీబాయి నగరంలోని రిక్కాబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నయాబజార్, తల్లంపాడు, నాయకన్‌గూడెం ఉన్నత పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈవో సోమశేఖర శర్మ.. కొణిజర్ల, తనికెళ్ల, పాండురంగాపురం, నారాయణ స్కూల్, నయాబజార్, టేకులపల్లి, శ్రీచైతన్య స్కూల్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్కాడ్స్ 38 కేంద్రాలను తనిఖీ చేశారు. 97 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు 163 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. కాగా.. ప్రతీ కేంద్రం వద్ద సెంటర్ కోడ్‌తోపాటు డీఈవో, ఎంఈవోల ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని ఆదేశించినా చాలా చోట్ల అమలు కాలేదు. నగరంలోని చాలా కేంద్రాల్లో ఎంఈవోల నెంబర్లు తప్పుగా వేయగా, కొన్ని ప్రధాన కేంద్రాల వద్ద ఫోన్ నెంబర్లు కనిపించలేదు.
కొత్తగూడెం గణేష్ టెంపుల్, మార్చి 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 73 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 12,269 మంది రెగ్యులర్ విద్యార్థులకు.. 12,235 మంది పరీక్ష రాశారు. 99 శాతం హాజరు నమోదైంది. ప్రైవేట్ విద్యార్థులు 25 మందికి.. 18 మంది హాజరయ్యారు. జిల్లాలోని రెండు సెంటర్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఏడు కేంద్రాలను డీఈవో వెంకటేశ్వరాచారి, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు 29 కేంద్రాలను తనిఖీ చేశారు.