పాల్వంచ, ఆగస్టు 21 : ఒడిశా రాష్ట్రం నుంచి పాల్వంచ మీదుగా రూ.53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని, మారణాయుధాలను కేరళలోని కొచ్చికి తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గంజాయితోపాటు మారణాయుధాలను తరలిస్తున్న ముఠాలోని ఒక వ్యక్తి పారిపోగా.. ముగ్గురిని పట్టుకొని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించారు. పాల్వంచలోని ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ హరికిరణ్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసీం ఆదేశాల మేరకు పాల్వంచలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు ఐచర్ వాహనంలో తనిఖీలు నిర్వహించగా.. రూ.53 లక్షల విలువ చేసే 106 కేజీల గంజాయి, మరో ఓక్స్ వ్యాగన్ ఫోలో కారులో ఒక పిస్తోలు, 5 రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లు, రూ.35,500 నగదు లభించినట్లు చెప్పారు. కేరళ రాష్ట్రం ఎర్నాకులం వెలుకొండం నావల్ ఆర్నమెంట్‌కు చెందిన వ్యక్తుల్లో ఏ1 బీఎస్.బిలాస్, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి తొరియూర్కు చెందిన ఏ2 శ్యాంసుందర్, ఇదే రాష్ర్టానికి చెందిన ఏ3 కాశీ నందన్ సంతోశ్లు పట్టుబడగా.. ఏ4 జేమ్స్ పరారీలో ఉన్నట్లు వివరించారు.
సదరు వాహనాల్లో పాల్వంచ మీదుగా చెన్నైలోని తిరుచ్చికి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్రమంగా మారణాయుధాలను కొనుగోలు చేసి కేరళలోని కొచ్చికి తరలిస్తున్నట్లు నిందితులు వివరించినట్లు ఆయన చెప్పా రు. నిందితులను పట్టుకునేందుకు పకడ్బందీగా వ్యవహరించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఇన్స్పెక్టర్ ఎం.రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిరావు, సిబ్బంది కరీం, బాలు, సుధీకర్, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, విజయ్, హరీశ్, వీరబాబు, ఉపేందర్లను డీసీ అభినందించారు. సమావేశంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ తిరుపతి, జానయ్య, పాల్వంచ సీఐ ప్రసాద్ పాల్గొన్నారు.