ముదిగొండ, అక్టోబర్ 22 : భూ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరుపేదలు గూడు కోసం ఆనాడు ఆ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేశారు. అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో గుడిసెవాసుల పోరాటం తీవ్రరూపం దాల్చగా.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో పోలీసులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారి పోరాటస్ఫూర్తికి వెలసిన అమరవీరుల స్తూపం ‘ముదిగొండ కాల్పుల ఘటన’ను ఇప్పటికీ గుర్తుకు తెస్తుంది. అయితే ఏ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేశారో ఆ భూమినే అధికార పార్టీ నాయకుడు ఇప్పుడు దర్జాగా కబ్జా చేశాడు. ప్రస్తుతం అధికారం మాదే.. అడిగేవారెవరు అనే ధీమాతో యథేచ్ఛగా పంట సాగు చేసుకుంటున్నాడు. వివరాల్లోకెళ్తే.. 2007లో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో పేదలకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూమి పోరాటం చేపట్టారు. ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 145లో గల 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేశారు. ఈ పోరాటం 2007, జూలై 27 నాటికి తీవ్రరూపం దాల్చింది. గుడిసెలు వేసిన ప్రాంతంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేయగా.. అక్కడ మొదలైన ఘర్షణ పోలీసు కాల్పుల వరకు దారితీయడంతో కాల్పుల్లో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించింది. అయితే కాల్పుల ఘటనతో భయబ్రాంతులకు గురైన పేదలు తాము గుడిసెలు వేసిన ప్రాంతం నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోవడంతోపాటు ఆ భూమి గురించి మరిచిపోయారు.
దీనిని ఆసరా చేసుకున్న అధికార పార్టీ నాయకుడొకరు కొన్నాళ్లుగా ఆ భూమిపై కన్నేశారు. కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ పక్కనే ఉన్న తన భూమిలో దానిని కలుపుకొని దర్జాగా పంటలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఆ భూమి విలువ రూ.50 లక్షలపైనే ఉంది. అయితే ఒకరిద్దరు ఈ విషయాన్ని గమనించి.. ప్రశ్నించినా ఆ భూమి తనదే అని బుకాయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాడు కాల్పుల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం.. సదరు నాయకుడు ఆ పార్టీలోనే ఉండడంతో భూ ఆక్రమణపై మాట్లాడేందుకు గ్రామస్తులు వెనుకాడుతున్నారు. రూ.50 లక్షల విలువైన భూమి అప్పనంగా పట్టా చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నాడు పేదల కోసం భూ పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీలు సైతం సదరు ఆక్రమణదారుడిపై ఫిర్యాదు చేయకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుడి నుంచి స్వాధీనం చేసుకోకపోతే నాటి పోరాటానికి అర్థం లేకుండా పోతుందని గ్రామస్తులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను ఇటీవలే ముదిగొండ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించాను. వెంకటాపురంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నా దృష్టికి రాలేదు. దీనిపై మా సిబ్బందితో విచారణ జరిపించి ప్రభుత్వ భూమి అని తేలితే స్వాధీనం చేసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా, ఎంతటివారైనా కఠినచర్యలు తీసుకుంటాం.