ఖమ్మం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘స్టాక్ వస్తేనే పంపిణీ.. లేదంటే లేదు..’ అన్నట్లుగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ తీరు. అన్నదాతలకు సకాలంలో యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి తగినంత యూరియా తెప్పించాల్సింది పోయి.. ‘స్టాక్ వస్తేనే ఇస్తాం. లేదంటే నానో యూరియా వేయండి’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరోజుకారోజు కొంత మొత్తంగా ప్రభుత్వం యూరియా బస్తాలను తెప్పిస్తుండడం, వాటిని కూడా అప్పటికప్పుడే సొసైటీ గోదాములకు పంపిస్తుండడం, అవికూడా వచ్చీరాగానే అయిపోతుండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, కూపన్ల కోసమే అష్టకష్టాలు పడుతున్న రైతులు యూరియా బస్తాల కోసం కూడా తెల్లవారుజామునే వ్యవసాయ సహకార పరపతి సంఘాల వద్దకు, వాటి గోదాముల వద్దకు చేరుకుంటున్నారు. గంటల తరబడి, రోజుల తరబడి వేచిచూసినా యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. అయితే, పంటలు పొట్టదశలో ఉన్న ఈ సమయంలోనూ యూరియాను వేయకపోతే దిగుబడి కూడా తగ్గుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానకాలం సీజన్ పంటలు చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతకు అంతం లేకుండా పోతోంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, పంటల సాగు అంచనాకు అనుగుణంగా యూరియాను ముందుగానే తెప్పించుకోకపోవడం వంటి కారణాలతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. సర్కారు నిర్లక్ష్యం చివరికి పంటల దిగుబడిపైనా ప్రభావం చూపేలా కన్పిస్తోంది. పత్తి, వరి పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. ఈ తరుణంలో చివరిసారిగానైనా ఒకసారి యూరియా అందించాల్సిన అవసరం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. యూరియాను సకాలంలో అందించడంలో పూర్తిగా విఫలమైన రేవంత్ ప్రభుత్వం.. ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించుకోవాలంటూ ప్రచారం మొదలుపెట్టింది. అయితే, నానో యూరియా కంటే యూరియాను వినియోగిస్తేనే మంచి ఫలితముంటుందంటూ రైతులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా వరిసాగు చేపడుతారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వరి పొలాలు ఈనే దశకు చేరుకున్నాయి. మిగిలిన మైదాన ప్రాంతాల్లోని పంటలకు మరో 15 రోజుల్లో యూరియా వేయకపోతే పంటలు చేతికి రావడం కష్టమేనంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే వారు రేయింబవళ్లూ ఎదురుచూస్తున్నారు. తెల్లవారుజాముల్లోనే వచ్చి సొసైటీ గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. పాలేరు, వైరా నియోజకవర్గాల్లో సగ భాగం, మధిర నియోజకవర్గంలో కొంతభాగం ప్రాంతాల్లో ఈసారి వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని రైతులకు ఈ సమయంలో ఎరువులు అందించినా వారు కొంత మేరకు తమ పంటలను కాపాడుకునే అవకాశం ఉంది.
కొణిజర్ల, సెప్టెంబర్ 26: వరి పైరు పొట్టకు వచ్చినా కట్ట యూరియా కూడా దొరకడం గగనమవుతోందని కొణిజర్ల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల్లోనూ, వాటి సబ్ సెంటర్లలోనూ ఒక్కో రైతుకు ఒక్కో కట్ట చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే అవి ఏ మూలకూ సరిపోవడంలేదంటూ అన్నదాతలు తలలు బాదుకుంటున్నారు. యూరియా వచ్చిందనే సమాచారం తెలిస్తే చాలు.. రైతులందరూ అర్ధరాత్రి అయినా, తెల్లవారుజాము అయినా వచ్చి సొసైటీ గోదాముల వద్ద క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అవి కూడా ముందుగా వచ్చి కూపన్లు పొందిన కొందరికే పరిమితమవుతున్నాయి. ఇదే క్రమంలో మండలంలోని సింగరాయపాలెం సబ్ సెంటర్‌కు శుక్రవారం 10 టన్నుల యూరియా వచ్చింది.
ఇందుకు సంబంధించిన కూపన్లను గుబ్బగుర్తి రైతు వేదికలో ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే రైతులు, మహిళా రైతులు, వృద్ధ రైతులు వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. వారిలో కొందరు చంటి పిల్లల తల్లులు కూడా ఉన్నారు. వారంతా రోజు మొత్తం క్యూలైన్లలో పడిగాపులు కాశారు. అక్కడ ఒక్కో బస్తా చొప్పునే కూపన్లు ఇవ్వడంతో సుమారు 7 కిలోమీటర్ల దూరం వెళ్లి యూరియా బస్తా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులకు మాత్రమే యూరియా కూపన్లు ఇవ్వడంతో మహిళల పేరిట పొలాలు ఉన్న వారు, వృద్ధుల పేరిట పొలాలు ఉన్న వారు ఇక్కడికి రావాల్సి వస్తోంది. అయితే, పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులకు కనీసం ఒక్క బస్తా కూడా అందడం లేదు. ఇక, పెద్దమునగాల సబ్‌సెంటర్ పరిధిలో శుక్రవారం రైతుల బారులే కన్పించాయి. వానకాలం సీజన్ ముగుస్తున్నా యూరియా కొరత మాత్రం తగ్గడం లేదు. పైగా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో, యాసంగి సీజన్‌పై రైతుల్లో ఆందోళన నెలకొంటోంది.