ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనున్నది.. జిల్లా ప్రధానాసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానున్నది.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంగళవారం కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది.. దీంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. హాస్పిటల్ 500 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందనున్నది.. రూ.8.90 కోట్లతో మెడికల్ తరగతులు, వైద్య విద్యార్థుల వసతికి పాత కలెక్టరేట్, రోడ్లు భవనాలశాఖ, వైద్యారోగ్యశాఖ కార్యాలయాల్లో ఆధునీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీట్ పరీక్ష అనంతరం 100 సీట్ల భర్తీకి అడ్మిషన్లు పూర్తవుతాయి. జూలై లేదా ఆగస్టులో విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 18: సీఎం కేసీఆర్ చొరవతో జిల్లా ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరనున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా ఉత్తర్వులతో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
రూ.8.90 కోట్లతో పనులు..
ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చకాచకా పనులు పూర్తవుతున్నాయి. ఏర్పాట్లపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన వనరులు సమకూరుస్తున్నారు. ఆసుపత్రిని 500 పడకల హాస్పిటల్‌గా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే నిత్యం వేలాది మంది నిరుపేదలకు వైద్యసేవలు అందనున్నాయి. ఇప్పటికే పాత కలెక్టరేట్, రోడ్లు భవనాలు, జిల్లా వైద్యారోగ్యశాఖల భవనాలు మెడికల్ కళాశాల పరిధిలోకి వచ్చాయి. రూ.8.90 కోట్లతో తరగతుల నిర్వహణ, హెచ్‌వోడీల చాంబర్లు, బ్లాకులతో పాటు ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వైద్య విద్యార్థినుల వసతి కోసం పాత వైద్యారోగ్యశాఖ జిల్లా కార్యాలయంలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు ఇటీవల అర్బన్ తహసీల్దార్ శైలజ పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ శాఖల భవనాలకు సంబంధించిన దస్ర్తాలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు చేతికి అందించారు.
100 మందికి అడ్మిషన్లు..
వైరా రోడ్లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని వైద్యవిద్యార్థులు సులువుగా జిల్లా ప్రభుత్వాసుపత్రి నుంచి పాత కలెక్టరేట్(మెడికల్ కళాశాల)కు, ఆసుపత్రి నుంచి కళాశాలకు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటికి సంబంధించిన దస్ర్తాలు ప్రస్తుతం కలెక్టర్ టేబుల్‌పై ఉన్నాయి. ఇప్పటికే మెడికల్ కళాశాలకు (నేషనల్ మెడికల్ కమిషన్) ఎన్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇచ్చేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. మే లేదా జూన్‌లో జరిగే నీట్ పరీక్ష అనంతరం 100 సీట్ల భర్తీకి అడ్మిషన్లకు లైన్ క్లియర్ అవుతుంది. అడ్మిషన్లు పూర్తి కాగానే వెంటనే తరగతులూ ప్రారంభమవుతాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మెడికల్ కళాశాల కల సాకారం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, పెద్దాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.