“ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జాతీయస్థాయిలో అండగా నిలబడేందుకు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మరో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు వస్తున్నారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ చరిత్రాత్మకం కానున్నది. ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలొచ్చి బీఆర్ఎస్ సత్తా చాటాలి” అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో శనివారం ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి బతుకునిచ్చే సింగరేణిని కాపాడుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, దేశవ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేంద్రం ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, టీఎస్ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇల్లెందు, జనవరి 14 : బీఆర్ఎస్ పార్టీ సత్తా ఢిల్లీ పీఠానికి తెలిసేలా ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం సమీపంలోని ఎస్ఎస్ ఫంక్షన్హాల్లో జరిగిన సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా పుట్టి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని, దేశంలో తెలంగాణ ఇప్పుడు నంబర్‌వన్ రాష్ట్రమన్నారు. 14 ఏండ్లు పోరాడి లక్ష్యాన్ని సాధించామని, ఈ రోజు దేశంలో ఒక నినాదం, ఒక నానుడి ఉందని తెలంగాణ ఆచరిస్తది.. రేపు దేశం మొత్తం అనుసరిస్తదన్నారు. ఇది అక్షర సత్యమన్నారు. మనం మిషన్ భగీరథ ప్రారంభిస్తే ఘర్ ఘర్‌కో జల్ అని, మనం మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగు చేస్తే అమృత సరోవర్ అని, మనం కల్యాణలక్ష్మి తెస్తే కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం అమలు చేస్తున్నదన్నారు. రైతుబంధు తెస్తే పీఎం కిసాన్ ఆత్మ నిర్భర్ తెచ్చారని తెలిపారు.
రైతాంగానికి సాగునీటి పన్ను రద్దు, సకాలంలో ఎరువులు, ఉచిత విద్యుత్, ఆసరా లాంటి అనేక పథకాలను రాష్ట్రంలో అందిస్తున్నామన్నారు. ఇవి ఏరాష్ట్రంలో కూడా జరగడంలేదని, తెలంగాణ ఒక మోడల్ అని తెలిపారు. దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశం మొత్తం కావాలని కోరుకుంటుండగా మరోవైపు బీజేపీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బొగ్గు బావులను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకుంటూ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నదన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వరంగ కంపెనీలను అప్పుల ఊబిలోకి నెట్టి ఆదాని, అంబాని లాంటి వారికి అప్పజెప్పాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇల్లెందు పుట్టిందే సింగరేణి మీద అని, బొగ్గు బ్లాకులను అమ్ముకుంటున్న బీజేపీకి ఇల్లెందు లాంటి గడ్డ మీద స్థానం ఉంటుందా అని ప్రశ్నించారు. అదే సింగరేణికి అప్పగిస్తే 40వేల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు వస్తాయికదా అన్నారు.
ఉద్యమాల గైడ్డెన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టం చేశారు. బీజేపీ హఠావో.. సింగరేణి బచావో నినాదంతో ముందుకెళ్తేనే సింగరేణికి భవిష్యత్తన్నారు. సింగరేణిని కాపాడుకోవాలంటే బీజేపీని కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్రప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుండగా రాష్ట్రంలో వేల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కావాల్నా, కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్, నీరు, రైతుబంధు, రైతుబీమా లాంటి అనేక పథకాలు కావాలని దేశం కోరుకుంటున్నదన్నారు. కేసీఆర్‌ను బలోపేతం చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు ఈ సభకు వస్తున్నారని, స్థానిక సీపీఐ, సీపీఎం నాయకులను కూడా సమన్వయం చేసుకుని తీసుకురావాలని చెప్పారు. అలాంటి ఒక గొప్ప సభ ఖమ్మంలో జరగబోతున్నదని మీరంతా కేసీఆర్‌కు అండగా నిలబడేందుకు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీజేపీతో దేశంలో విద్వేషాలు, నిరుద్యోగం పెరిగిపోతూ ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంటున్నదని, ఇటువంటి సమయంలో బీజేపీలోకి వెళ్లాలని ఎవరైనా అనుకుంటే అది ఆత్మహత్యా సదృశ్యమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాజకీయ భవిష్యత్ నాశనమవుతుందని, అలాంటి నిర్ణయం తీసుకుంటే తమనెత్తి మీద తామే మట్టి పోసుకున్నట్టువుతుందన్నారు.
ఇల్లెందు ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి కావాల్సిన మందులు, వైద్యులు, పరికరాలను అందిస్తామని ఎమ్మెల్యే హరిప్రియకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మె ల్యే హరిప్రియ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, టీఎస్ఎంబీసీ చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ బిందు, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాషా, రైతుబంధు సమితి నాయకుడు పులిగళ్ళ మాధవరావు, పలువురు ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదు. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు యావత్ తెలంగాణ ప్రజలు మరోసారి సిద్ధమవుతున్నారు. సింగరేణిని తెగనమ్మే బీజేపీకి ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు లేదు. ఈ ప్రాంతంలో ఎవరైనా బీజేపీలో చేరాలంటే అంతకుమించి ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండబోదు.
– మంత్రి హరీశ్‌రావు
బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ఎదురులేదు. బీజేపీతో ఏమీకాదు. యావత్ దేశం ఖమ్మం సభ వైపే చూస్తోంది. సభ తర్వాత దేశ రాజకీయాలు కీలకమలుపు తిరగనున్నాయి. ఇల్లెందులో త్వరలో బస్ డిపో నిర్మాణం పూర్తి కానున్నది.
కూరగాయల మార్కెట్ సైతం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభిస్తారు.
2001లో కేవలం అతికొద్ది మందితో కరీంనగర్లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఆ తర్వాత చరిత్ర సృష్టించింది. అదే విధంగా ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిపోవాలి. అందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావాలి. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తీసుకొస్తే ఇక్కడి ప్రజలు ఆయన్ను కాపాడుకున్నారు. అందుకే ఆయనకు జిల్లాపై ప్రేమ. అలాంటి కేసీఆర్‌ను వదిలి కొందరు పార్టీకి ద్రోహం చేయాలని చూస్తున్నారు. మనమంతా కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో 10 నియోజకవర్గ స్థానాలకు 10 స్థానాలు గెలిచి పార్టీని నిలబెడదాం. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు ప్రకటించారు. జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ.10లక్షల చొప్పున విడుదల చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు చేశారు. కొత్తగూడెంలో 750 పడకలతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. 2014 ముందుకు ఇలాంటి అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. ఇదే విధంగా కేసీఆర్ దేశాభివృద్ధిని కోరుకుంటున్నారు. తెలంగాణ మాడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసే క్రతువులో మనమంతా భాగస్వాములమవ్వాలి.
– పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించాయి. ప్రజలు ఆయా పార్టీలన్నింటినీ మట్టికరిపించారు. ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అదే విధంగా బీజేపీ ఇప్పుడు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో రైతులతో పాటు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆయనకు అండగా నిలబడి సభను విజయవంతం చేద్దాం. మరో చరిత్ర సృష్టిద్దాం. ఖమ్మం సభ దేశ ప్రజలందరినీ ఆలోచింపజేస్తుంది. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు బాటలు వేస్తుంది.
– తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి
నాయకులు ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఖమ్మం సభకు 50 వేల మందికి తగ్గకుండా తరలించాలి. సమన్వయంతో పని చేసి సభను విజయవంతం చేయాలి. సభకు తరలే వారి సంఖ్యను బట్టి తగినన్ని వాహనాలు కేటాయించాలి.
– తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
ఖమ్మంలో జరుగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోనున్నది. సభను విజయవంతం చేసి మనమూ చరిత్రలో భాగమవుదాం. దీనిలో భాగంగా సభకు భారీగా జన సమీకరణ చేద్దాం. మండలాల వారీగా జనాన్ని పోగెద్దాం. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్దాం.
– హరిప్రియానాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే
ఖమ్మంలో జరుగనున్న బీఆర్ఎస్ సభకు నాయకులు భారీగా కార్యకర్తలు, ప్రజలను తరలించాలి. పార్టీ పరంగా భద్రాద్రి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. జిల్లా వ్యాప్తంగా జనాన్ని తరలించేందుకు సమాయత్తం కావాలి. సభను విజయవంతం చేయాలి.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం సభకు భారీగా జన సమీకరణ చేయాలి. పార్టీ అధినేత కేసీఆర్‌కు అండగా నిలిచి ఉమ్మడి జిల్లా గౌరవాన్ని కాపాడాలి. సభను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కార్యోన్ముఖులు కావాలి. బాధ్యతగా పనిచేయాలి.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
బీఆర్ఎస్ను మోసం చేసి ఇతర పార్టీల్లో చేరే నేతలకు రాజకీయ భవిష్యత్తు ఉండ దు. రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ అన్ని విధాలా బాగా చూసుకుంటున్నారు. ఇదే విధమైన పాలనను దేశ ప్రజలందరూ ఆయన నుంచి కోరుకుంటున్నారు. పార్టీని జాతీయస్థాయిలో నిలబెట్టే విధంగా మనమందరం పనిచేయాలి. కేసీఆర్‌కు అండదండలు అందించాలి.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
ఖమ్మం జిల్లా ఉద్యమాల గడ్డ. ఉమ్మడి జిల్లా ప్రజలు ఖమ్మం సభను విజయవంతం చేయాలి. మరోసారి పాత చరిత్రను తిరగ రాయాలి. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని అభివృద్ధి చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలోనూ సాధించలేనంత ప్రగతి సాధించారు. దీంతో బీజేపీ నేతల కన్ను రాష్ట్రంపై పడింది. వారి ఆటలు తెలంగాణలో సాగవు అని ప్రజలు సభకు విచ్చేసి తేల్చి చెప్పాలి.
– ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్