కలెక్టరేట్, ఏప్రిల్ 17: యాసంగి వరి ధాన్యాన్ని ఊరూరా కొనుగోలు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాంగి పంటకు సంబంధించి అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. వడగండ్ల వాన వచ్చే అవకాశాలు ఉన్నందున, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 3.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని తెలిపారు.
ఏ-గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి రూ.2,060, బీ గ్రేడ్‌కు రూ.2,040 చెల్లించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 6,254 టర్పాలిన్లు, 816 తూకపు యంత్రాలు, 620 మాయిశ్చర్ మిషన్లు, 622 పాడి క్లీనర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజూ పౌర సరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లు కేంద్రాల ఇన్చార్జిలతో రివ్యూ చేసుకోవాలన్నారు. మండలాల్లోని కేంద్రాలను తహసీల్దార్లు పరిశీలించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, పవన్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రణధీర్‌రెడ్డి, డీసీవో బుద్ధనాయుడు, డీసీఎస్వో జితేందర్‌రెడ్డి, డీఎంసీఎస్సీ జితేంద్రప్రసాద్, డీటీవో కొండల్రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.