Godavarikhani | కోల్ సిటీ, జూన్ 3: పుట్టిన రోజు అంటే సన్నిహితుల మధ్య జరుపుకోవడం.. లేదంటే పది మందికి అన్నదానం చేయడం సహజం. కానీ, గోదావరిఖనికి చెందిన బుల్లితెర నటుడు, సీనియర్ కళాకారుడు అశోక్ వేముల మాత్రం వినూత్న కార్యక్రమం చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా గోదావరిఖనిలోని రెల్లి కార్మికులను మంగళవారం ఒక చోటకు చేర్చి సత్కరించి గౌరవించారు.
నగదు ప్రోత్సాహకం అందించి వారి సేవలను కొనియాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి రక్షణగా బార్డర్లో ఉండేది సైనికులైతే సమాజంలో మనమంతా ఆరోగ్యంగా ఉండేందుకు తమ ప్రాణాలు లెక్కచేయకుండా మానవ వ్యర్థాల తో వ్యాధుల బారిన పడకుండా మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న రెల్లి కార్మికులు కూడా సైనికులేనని అభివర్ణించారు. వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. సమాజంలో వీరిని చిన్నచూపు చూడకుండా ప్రభుత్వాలు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గృహవసతి, పెన్షన్, పిల్లలకు ఉచిత విద్య, వైద్య వసతులు అందింఅలని కోరారు. తమ ప్రాణాలు కూడా లెక్కచేయక మానవ వ్యర్థాలను శుభ్రం చేయడంలో విశిష్ట సేవలందిస్తున్న వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు దక్కాలని కోరారు. అనంతరం వేముల అశోక్ ను పలువురు అభినందించారు.
ఎవరి ఊహకు అందని విధంగా పుట్టిన రోజున రెల్లి కార్మికుల పట్ల కృతజ్ఞతా భావంతో వారిని కీర్తించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో దయానంద్ గాంధీ, డాక్టర్ జేవీ రాజు, కొమ్మ కుమార్, నీరటి శంకర్, మేకల శ్రీకాంత్, ఫిరోజాన్, షరీఫ్, కన్నం రమేష్, ఫయాజ్, విజయ్, కొల్లూరు ప్రసాద్, దామెర శంకర్ తదితరులు పాల్గొన్నారు.