MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, డిసెంబర్ 6 : కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శనివారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అహింసా మార్గాన్ని ఎంచుకొని పరిపాలన వ్యవస్థను మార్చడంతో పాటు సమానత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించారన్నారు. గ్రామాల్లో కుల,మత అనే బేధాలు లేకుండా అందరూ సమానమే అనే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. భారతీయులకు ఆరాధ్యుడు బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత భారతదేశ అభ్యున్నతి కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.