Karimnagar | తిమ్మాపూర్, మే 24: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్ర శివారులోని ఎల్ఎండీ రిజర్వాయర్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. రామకృష్ణ కాలనీకి చెందిన ఓ రైతు అటుగా వెళ్తుండగా.. చెట్టుకు ఓ యువకుడు ఉరేసుకుని కనిపించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ వ్యక్తి స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వెళ్లి చూసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని మానకొండూరు మండలం సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధ్గా పోలీసులు గుర్తించారు. చేతులు కట్టేసి, చెట్టుకు ఉరేసినట్లు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.